గ్రేట్ ఎన్నిక
మొత్తం డివిజన్లు : 150
పోలింగ్ కేంద్రాలు : 7,802
{పధాన పోలింగ్ కేంద్రాలు : 7,757
అనుబంధ పోలింగ్ కేంద్రాలు : 45
పోలింగ్ లొకేషన్లు : 3,117
ఓటు... వజ్రాయుధం-సకల సమస్యలకు పరిష్కార మార్గం సమష్టిగా కదులుదాం - జన చైతన్యమై నినదిద్దాం
అందరం ఓటేసి తీరుదాం...
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. ఇన్నాళ్లూ నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన నేతల భవితవ్యం ఈవీఎంలలోకి చేర బోతోంది. అయిదేళ్ల కాలానికి తమను పాలించేదెవరో ఓటరు దేవుడు నిర్ణయించబోతున్నాడు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాజకీయ పక్షాలతో పాటు ఎన్నికల యంత్రాంగానికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పావులు కదిపితే... పోలింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గ్రేటర్ ఫలితాలు రాజకీయ పక్షాల భవిష్యత్‌ను నిర్దేశించే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకున్నాయి. అభివృద్ధిని కొనసాగించాలంటే తమను బలపరచాలని టీఆర్‌ఎస్ జనానికి విజ్ఞప్తి చేస్తే... తమ అభ్యర్థులకే మద్దతిచ్చి... కేసీఆర్ పాలనను తిరస్కరించాలంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు పిలుపునిచ్చాయి. అన్నిటికీమించి ఈ ఎన్నికల్లో ఎంపీ కేశవరావు కూతురు విజయలక్ష్మి... మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మాజీ మంత్రులు ఎ.నరేంద్ర సతీమణి, మేచినేని కిషన్‌రావు కుమారుడు శ్రీనివాసరావు, మహేశ్వరం, మల్కాజిగిరి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కనకారెడ్డి, సాయన్నల కోడళ్లు, కూతుళ్లతో పాటు మాజీ మేయర్లు బండ కార్తీకరెడ్డి, మాజిద్‌హుస్సేన్ బరిలో ఉండటంతో సంబంధిత డివిజన్లలో పోటీ ఆసక్తికరంగా మారింది.
పోలింగ్ పెంచేందుకు ప్రత్యేక కసరత్తు
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2002 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 41 శాతం, 2009లో 42 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి 50 శాతాన్ని దాటించే దిశగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఓటరు స్లిప్పులను ఇంటింటికీ పంచడంతో పాటు వెబ్, యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. స్వచ్ఛంద సంస్థలతో ‘లెట్స్ ద ఓట్’ అంటూ ముమ్మరంగా ప్రచారం చేసింది. భారీగా పోలింగ్ నమోదయ్యే కాలనీలు, బస్తీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలకు సిఫారసు చేయాలని భావిస్తోంది. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న కాలనీలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించింది.
వెబ్‌సైట్ ద్వారా ఇలా ఓటరు స్లిప్ పొందవచ్చు
‘డౌన్‌లోడ్ ఓటర్ స్లిప్’ పై క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్ జీహెచ్‌ఎంసీ ఓటరు స్లిప్ అని వస్తుంది.సర్కిల్, వార్డు, డోర్ నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు తెలపాల్సిందిగా సూచిస్తుంది. ఎపిక్ నెంబరు (ఓటరు గుర్తింపు కార్డు నెంబరు) నమోదు చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.