గ్రేటర్ పెళ్లిపందిరి..
నేడు వేలాది వివాహాలు..
కళకళలాడుతున్న ఫంక్షన్‌హాళ్లు
సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పెళ్లి పందిరవుతోంది. ఆకాశం అదిరేలా.. కళ్లు చెదిరేలా విద్యుత్ కాంతులతో కల్యాణ మండపాలు ముస్తాబయ్యాయి. మార్గశిర మాసం బహుళ ఏకాదశి గురువారం ఉదయం 11.39 గంటలకు ‘కుంభలగ్నం’ దివ్యమైన మూహూర్తం. ఈ శుభ తరుణాన నగరంలో వేలాది వివాహాలు జరుగనున్నాయి. ఈ ఏడాదికి ఇదే చివరి మంచి ముహూర్తం. వచ్చే జనవరి 23 వరకు మంచి ముహూర్తాలు లేవు. నగరంలోని హైటెక్స్, అమీర్‌పేట్, పంజ గుట్ట, నాంపల్లి, అబిడ్స్, సికింద్రాబాద్, బొల్లారంతో పాటు శివార్లలోని చంపాపేట్, ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, మొయినాబాద్, మేడ్చల్.. ఏ రూట్లో చూసినా ఈ రోజున పెళ్లి బాజాలే మోగనున్నాయి. పెళ్లిళ్లు అధికంగా ఉండడంతో నగరంలో సుమారు పాతిక వేల మండపాలు, ఫంక్షన్‌హాళ్లు బుక్కయినట్టు అంచనా. ఇక క్యాటరింగ్, డెకరేషన్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్స్, బ్యాండు, సన్నాయి మేళం నిర్వాహకులకు సైతం గిరాకీ పెరిగింది. ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులైతే డిమాండ్‌కు తగ్గట్టు భారీగా అద్దెలు పెంచినట్టు పలువురు వాపోతున్నారు. మండపం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఐదు గంటల వేడుకకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు అద్దె వసూలు చేయడం గమనార్హం.
ట్రాఫిక్ జంఝాటం తప్పదు..!
ఇక సిటీజన్లు పెళ్లి వేడుకకు హాజరవడం ఒకెత్తయితే గురువారం పలు రూట్లలో రెండు గంటలకు పైగా ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోక తప్పని పరిస్థితి రానుంది. అన్ని ముహూర్తాలు ఒకే సమయానికి ఉండడం, ఆయా రూట్లలో వీఐపీల రాకపోకలకు తోడు వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాహనాలు ఒక్కసారిగా నగర రోడ్లను ముంచెత్తనుండడంతో అడుగు తీసి వేసే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు.