
‘అసెంబ్లీ’కి సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్!
- నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎల్పీ భేటీ
- అధికారపక్ష సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం భేటీ కానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో.. ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమావేశాల్లో విపక్షాలు ఏ డిమాండ్లు చేస్తాయి, ఏ ప్రశ్నలు సంధిస్తాయన్న అంశాలపై దృష్టి పెట్టడం కంటే.. రెండున్నరేళ్ల స్వల్ప సమయంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేశామో చెప్పుకోవడానికే ప్రాధాన్యమివ్వాలన్న వ్యూహంతో అధికార పార్టీ ఉందని నేతలు చెబుతున్నారు.
విపక్షాల ప్రశ్నలతో సంబంధం లేకుండా ఆయా శాఖల వారీగా పూర్తి వివరాలను సభ ముందుంచే వ్యూహంతో ఉందని అంటున్నారు. మంత్రులను ఏ, బీ కేటగిరీలుగా విభజించడం, ఆయా సభ్యులు వారికి పట్టున్న సబ్జెక్టులపై అసెంబ్లీలో మాట్లాడేలా సిద్ధం చేసి బాధ్యతలు అప్పగించడం వంటి వాటిపై టీఆర్‌ఎస్ ఎల్పీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశాలపై సీఎం సభ్యులకు వివరించే వీలుంది. ఇక నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకున్న చొరవ తదితర అంశాలనూ భేటీలో సీఎం తమ సభ్యులకు తెలియజేస్తారని సమాచారం. మొత్తంగా శీతాకాల సమావేశాలను అర్థవంతంగా ముగించేందుకు అధికార పక్ష సభ్యులుగా నిర్వహించాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.