హైదరాబాద్ అతలాకుతలం | too heavy rains shatter lives of common people in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ అతలాకుతలం

Published Wed, Aug 31 2016 2:00 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

హైదరాబాద్ అతలాకుతలం - Sakshi

హైదరాబాద్ అతలాకుతలం

ఇటీవలి కాలంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయింది. జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. భోలక్‌పూర్, రామంతపూర్ ప్రాంతాల్లో గోడలు కూలి ఏడుగురు మరణించారు. హుస్సేన్‌సాగర్ నీటిమట్టం నాలుగు అడుగులకు పైగా పెరగడంతో అది ప్రమాదకరస్థాయిలో ఉందని.. తూములు తెరిచి నీటిని కిందకు వదిలారు. గత పదిహేనేళ్లలో ఎన్నడూ చూడనంతగా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్పారు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే చిరుజల్లులుగా మొదలైన వర్షం.. 7 గంటలకల్లా తీవ్రరూపం దాల్చింది. అక్కడి నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు కూడా పలు ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. సాధారణంగా హైదరాబాద్‌లో ఒక ప్రాంతంలో వాన పడితే మరో ప్రాంతంలో ఎండ కాస్తుందంటారు. కానీ ఈసారి మాత్రం అక్కడ, ఇక్కడ అని లేకుండా నగరం నలుమూలలా భారీగా వర్షాలు కురిశాయి. కడపటి సమాచారం అందేసరికి అంబర్‌పేట ప్రాంతంలో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. (నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు)

 

అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్

హయత్‌నగర్ వైపు నుంచి గానీ, కూకట్‌పల్లి వైపు నుంచి గానీ, సికింద్రాబాద్ వైపు నుంచి గానీ నగరంలోకి రావడానికి ఏమాత్రం వీలులేకుండా అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నీళ్లు మోకాలిలోతులో నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కూకట్‌పల్లి నుంచి పంజాగుట్ట చౌరస్తా చేరుకోడానికి ఉదయం సమయంలో దాదాపు రెండు గంటలకు పైగా పట్టింది. ఇక దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి మియాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు చుక్కలు చూశారు. చాలాచోట్ల కార్లు దాదాపు మూడు వంతులు మునిగిపోయాయి. తాను కారు తీసుకున్న తర్వాత ఐదేళ్లలో తొలిసారి ఇలా జరిగిందని, బెల్టు శబ్దం సైతం చాలా తేడాగా వచ్చిందని నిజాంపేట ప్రాంతానికి చెందిన రాము 'సాక్షి'కి తెలిపారు. మలక్‌పేట బ్రిడ్జి కింద మూడు బస్సులు ఇరుక్కుపోయాయి. నగరంలోని చింతల్‌బస్తీ ప్రాంతంలో ఒక కారు కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో దాన్ని, అందులోని డ్రైవర్‌ను కూడా కాపాడారు. సైఫాబాద్, మలక్‌పేట, అఫ్జల్‌గంజ్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.

 

ఉద్యోగుల పరిస్థితి దారుణం

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బయల్దేరి 9.30కల్లా వస్తామనుకుంటే.. 11.45కు గానీ ఆఫీసుకు చేరుకోలేకపోయామని కొందరు అన్నారు. మరికొందరు ఉదయం 10 గంటలకల్లా ఆఫీసులకు రావాల్సి ఉంటే.. సగం రోజు సెలవు పెట్టి, మధ్యాహ్నానికి చేరుకుంటామని చెప్పారు. ఇక భారీ వర్షం కారణంగా కార్యాలయాలకు ఒక గంట ఆలస్యంగా వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎంఎంటీఎస్ రైళ్లు

హైదరాబాద్‌లోని పలు మార్గాలలో తిరగాల్సిన ఎంఎంటీఎస్ రైళ్లను సైతం వర్షాల కారణంగా రద్దు చేశారు. బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకంగా నాలుగు రైళ్లను నడిపిస్తున్నారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద ప్రాంతంలో కూడా వాహనాలు నిలిచిపోయాయి.  

 

పాఠశాలలు, కళాశాలలకు సెలవు

విద్యార్థులు ఉదయం అష్టకష్టాలు పడి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తే.. వర్షం కారణంగా సెలవు ప్రకటించినట్లు యాజమాన్యాలు చెప్పాయి. వర్షాల నేపథ్యంలో రోడ్ల మీద మ్యాన్‌హోల్స్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం, విద్యార్థులు తడిసి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా సెలవులు ఇచ్చేశారు.

శిథిల భవనాలు ఖాళీ చేయాలి: మేయర్

హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో కొన్ని భవనాలు శిథిలస్థితికి చేరుకున్నాయని, ప్రజల ప్రాణాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వాటిని వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. శిథిలభవనాలను కూల్చేయాలని తాము ప్రయత్నిస్తున్నా, వాళ్లు మాత్రం కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న దృష్ట్యా పెను ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అందువల్ల ఇప్పటికైనా అలాంటి భవనాల్లో ఉన్నవాళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు వంద వరకు సహాయ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

ముమ్మరంగా సహాయచర్యలు: కమిషనర్

సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని జీహచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి తెలిపారు. వర్షాల పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దనరెడ్డి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో ఎవరూ ఉండొద్దని కోరారు. గోడలు కూలి మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రోడ్లపై నిలిచిన నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement