బ్రిటీషోళ్లకన్నా ఘోరం
సర్కారు తీరుపై టీపీసీసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రిటీషువారికన్నా ఘోరంగా నిర్బంధానికి పాల్పడుతోందని టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో మల్లన్నసాగర్ భూసేకరణపై పోరాటం, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణపై చర్చించారు.
అనంతరం సమావేశం వివరాలను పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియాకు వివరించారు. మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ రైతులను బెదిరిస్తోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీశ్‌రావు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కర్ణాటక, పాండిచ్చేరి సీఎంల రాక
ఈ నెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లో టీపీసీసీ నిర్వహించనున్న పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధుల శిక్షణ శిబిరాలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరు కానున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, కార్యదర్శి ఆర్.సి.కుంతియా తదితరులు హాజరవుతారని ఉత్తమ్ చెప్పారు.