రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది
Published Fri, Aug 9 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
సాక్షి, సిటీబ్యూరో: వరుస సెలవులతో రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో గురువారం పలు రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. ఈ పరిస్థితిని దక్షిణమధ్య రైల్వే, ఆర్టీసీ ‘క్యాష్’ చేసుకుంటూనే రద్దీకి తగిన అదనపు ఏర్పాట్లు చేపట్టాయి. వెయిటింగ్ జాబితా ప్రయాణికుల కోసం పలు రైళ్లలో అదనపు బెర్తులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది.
కర్నూలు, అనంతపురం సెక్టార్ మినహా మిగతా రూట్లలో బస్సుల రాకపోకలు యథావిధిగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పైగా విజయవాడ, నెల్లూరు,తదితర రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కర్నూలు సెక్టార్‌కు మాత్రం బస్సుల రాకపోకలు ఇంకా మెరుగు పడలేదు. ఆ సెక్టార్ నుంచి హైదరాబాద్‌కు రావలసిన బస్సులు సగానికి పైగా అక్కడే నిలిచిపోయాయి.
50 శాతం అదనపు చార్జీలు
ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీలు పెంచేసి ప్రయాణికుల నడ్డివిరిచే ఆర్టీసీ ఈసారీ సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా పెంచింది. గతంలో దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో మాత్రమే అదనపు చార్జీలను విధించే ఆర్టీసీ మూడు, నాలుగు రోజుల సెలవులను కూడా వ దిలిపెట్టకుండా చార్జీలు పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ రైల్వే ఏర్పాట్లు..
వరుస సెలవులతో విశాఖ, తిరుపతి, కాకినాడ వైపు వెళ్లే పలు రెగ్యులర్ రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. సెలవులను దృష్టిలో ఉంచుకొని సొంత ఊళ్లకు వెళ్లాలనుకొనే ప్రయాణికులను వెయిటింగ్ జాబితా నిరాశకు గురి చేస్తోంది. దీంతో పలు రైళ్లలో అదనపు బెర్తులను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్-తిరుపతి (12764/12763) పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 11న ఒక స్లీపర్‌కోచ్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఈ నెల 9, 12 తేదీలలో ఒక స్లీపర్‌క్లాస్ బోగీ అదనంగా అందుబాటులోకి రానుంది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ (17603/176 04) ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 11న ఒక అదనపు స్లీపర్ క్లాస్, తిరుగు ప్రయాణంలో 9,12 తేదీలలో ఒక్కొక్క అదనపు స్లీపర్‌క్లాస్ బోగీ ల చొప్పున అందుబాటులోకి రానున్నాయి.
తిరుపతి-మచిలీపట్నం (17401/17402) ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 9,11 తేదీలలో, తిరుగు ప్రయాణంలో 10,12 తేదీలలో ఒక అదనపు స్లీపర్ క్లాస్ అందుబాటులోకి వస్తుంది.
Advertisement
Advertisement