రైళ్లలో సరుకుల అక్రమ రవాణా!
* పరాకాష్టకు చేరిన జీరో దందా
* బిల్లులు లేకుండా రాష్ట్రానికి చేరుతున్న రూ.కోట్ల విలువైన సరుకులు
* రైల్వే రిసీట్ ఉంటే చాలు పన్నుల గురించి పట్టించుకోని రైల్వేశాఖ
* వాణిజ్యపన్నుల శాఖ తనిఖీల్లో బయటపడ్డ బండారం
* కేసుల నమోదుకు సహకరించని రైల్వే అధికారులు
సాక్షి, హైదరాబాద్: అమ్మకం బిల్లు, డెలివరీ చలాన్, వే బిల్లు... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకులు రవాణా చేసేటప్పుడు ఉండాల్సిన కనీస రసీదులివి.
కానీ రైళ్లలో సరుకులు రాష్ట్రాలు దాటివస్తున్నా ఈ బిల్లులేవీ కనిపించట్లేదు. కేవలం రైల్వే రిసీట్(ఆర్.ఆర్)తో లక్షల రూపాయల విలువైన వస్తు సామ గ్రి రైళ్లలో యథేచ్ఛగా నిత్యం రవాణా అవుతోంది. సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న రైల్వేశాఖ ఇతర రసీదుల గురించి పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. శుక్రవారం వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే గోడౌన్‌లు, స్టేషన్లలో జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలివి.
వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు సంయుక్త కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రేవతి రోహిణి నేతృత్వంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడల్లోని రైల్వే గోడౌన్‌లతోపాటు నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, కాజీపేట, వరంగల్ తదితర 10 రైల్వే గోడౌన్‌లలో అధికారులు తనిఖీ చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ నుంచి విలువైన సరుకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల ద్వారా రవాణా అవుతున్న విషయాన్ని గుర్తించారు.
రైల్వే గోడౌన్లలో కోట్ల రూపాయల విలువైన వస్తుసామగ్రి ఉన్నా, వాటిని పరిశీలించడమే తప్ప సీజ్ చేసేందుకు గానీ, కేసులు నమోదు చేసేందుకు గానీ వాణిజ్యపన్నుల శాఖను రైల్వే శాఖ అనుమతించకపోవడం గమనార్హం. అహ్మదాబాద్, నాగ్‌పూర్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, త్రివేండ్రం తదితర నగరాల నుంచి రోజూ కోట్ల విలువైన సామగ్రి పన్నులు చెల్లించకుండా హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలకు చేరుతోంది. రైల్వే గూడ్స్ ట్రాన్స్‌పోర్టులో వస్తువు విలువ, దాని బరువును బట్టి చార్జి చేసి రైల్వే రిసీట్(ఆర్.ఆర్) ఇస్తారు.
ఆర్‌ఆర్ చూపిం చి సదరు వ్యాపారి సరుకును తీసుకెళతారు. రెండు నెలల క్రితం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కంటైనర్లలో కోటి రూపాయల విలువైన బాస్మతి బియ్యం కూడా మెదక్ జిల్లా నాగులపల్లి వద్ద వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో దొరికాయి. ఈ సంస్థ కూడా రైల్వేకు అనుబంధంగా సాగుతున్నదే కావడం గమనార్హం.