సాక్షి,సిటీబ్యూరో: రెండురోజులపాటు నిలిచిపోయిన ఆటోలు ఎట్టకేలకు గురువారం సాయంత్రం రోడ్డెక్కాయి. వీరమోత మోగిస్తున్న చలానా రూ.1000 తగ్గించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆటోసంఘాలు కలిసి చేస్తున్న సమ్మెను విరమించారు. దీంతో నానాఇబ్బందులకు గురైన ప్రయాణికులు సమ్మె విరమణతో ఊపిరిపీల్చుకున్నారు. గురువారం సాయంత్రం రవాణాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆటోసంఘాల జేఏసీ ఆటోబంద్ విరమిస్తున్నట్లు ప్రకటించింది.
చలానా మొత్తాన్ని తగ్గించేందుకు సర్కారు సానుకూలంగా ఉందని,రవాణాశాఖ కమిషనర్ అనంతరాము,ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత వారిపై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఐఎఫ్‌టీయూ నాయకుడు నరేందర్ ‘సాక్షి’తో వెల్లడించారు. అయితే ఈ విరమణ తాత్కాలికం మాత్రమేనని, రవాణా మంత్రి బొత్సతో తాము త్వరలో జరుపనున్న చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. చలానా తగ్గింపు సంతృప్తికరంగా లేకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.
జీవో రద్దు చేసే వరకు ఉద్యమం..
కవాడిగూడ: అధిక చలాన్లను మోపే 108 జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే 13 ఆటోయూనియన్ల ఆధ్వర్యంలో జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సీఐటీయూ కార్యదర్శి ఈశ్వర్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 13 ఆటోసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో గురువారం జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ,ఐఎఫ్‌టీయూ, టీఏడీజేఏసీ, సీఐ టీయూ, టీఎన్‌టీయూసీ, బీఎంఎస్, ఏపీఏడీఎస్, టీఏటీయూ, టీఏడీయూ, టీటీయూసీ, జీహెచ్‌ఏడీసీ, ఆటోఓనర్స్ అసోసియేషన్, పేదప్రజల పార్టీ తరఫున ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఈశ్వర్‌రావు మాట్లాడుతూ నగరంలో 1.20 లక్షలు ఉన్న ఆటోలకు సరైన స్టాండ్లను ఏర్పాటు చేయలేని సర్కారు ఒకేసారి చలానా మొత్తాన్ని విధించే హక్కులేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో బతికే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వం..అధిక చలానాతో అప్పులపాల్జేస్తోందని ధ్వజమెత్తారు. అంతకుముందు రాంనగర్ చౌరస్తాలో ఐఎఫ్‌టీయూ,సీఐటీయూల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి 108 జీవో ప్రతులను తగులబెట్టారు.
రవాణా కమిషనర్ హామీతో బంద్ విరమణ
Published Fri, Sep 6 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement