నిధుల సముపార్జనపై ఉన్నతస్థాయి సమీక్ష
అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్‌పై కసరత్తు
ఆర్థిక ఆసరా కోసం హెచ్‌ఎండీఏ ఆరాటం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు సమగ్ర రవాణా వ్యవస్థను అమలు చేయాలని ెహ చ్‌ఎండీఏ యోచిస్తోంది. ఇందుకు అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలనే దానిపై కార్యచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)ను రూపొందించేందుకు నడుం బిగించింది. ఈ విషయమై ఉన్నతస్థాయి అధికారులు గడచిన 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు. నగరంలో ఆధునిక సమగ్ర రవాణా వ్యవస్థను అమల్లోకి తేవాలంటే అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.
ముఖ్యంగా నిధుల సమస్య ఎదురవ్వకుండా ప్రత్యేకంగా ‘అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని సమావేశం అభిప్రాయపడింది. రవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల్లేకుండా ముందుకె ళ్లడం అసాధ్యమని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇందుకోసం ఓ అకౌంట్‌ను తెరవాలని నిర్ణయించింది. ముఖ్యంగా రవాణా పన్ను, అభివృద్ధి ఆధారిత పన్నుల ద్వారా అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్‌ను సముపార్జించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
బెంగళూరులో రవాణా పన్ను కింద రూ.1 వసూలు చేయడం ద్వారా రూ.300కోట్ల నిధి తయారైందని, దీని ఆధారంగా అక్కడ మెట్రోరైల్ ఏర్పాటైందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్కీంల కింద ఆర్థిక ఆసరా ఇస్తే మెరుగైన వ్యవస్థను రూపొందించేందుకు అవకాశం ఉంటుంది, అలా వీలుగాని పక్షంలో పీపీపీ విధానం ద్వారానైనా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
ప్రజా భాగస్వామ్యంతో అంటే... స్వల్పంగా రవాణా పన్ను వసూలు చేయడం ద్వారా కొంతమేర నిధులు సముపార్జించుకొని, వీటి ఆధారంగా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ విక్రయ కేంద్రాల నుంచి కూడా నిర్ణీత సెస్స్ వసూలు చేయాలని నిర్ణయించారు.
ఖర్చు ఎక్కువ...
నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటుకు ఖర్చు ఎక్కువ... ఆదాయం తక్కువ కావడం హెచ్‌ఎండీఏను ఆందోళనలో పడేసింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ‘ఉమ్టా’లో తీసుకొన్న ఏ నిర్ణయం కూడా అమలుకు నోచుకోకుండా పోతోంది. ప్రభుత్వంలోని 16 విభాగాలు క్రమం తప్పకుండా ఉమ్టా సమావేశంలో పాల్గొంటున్నా... నిధుల విషయానికొచ్చే సరికి దేనికవే వెనుకంజ వేస్తుండటంతో సమగ్ర రవాణా వ్యవస్థ ఫైళ్లకే పరిమితమైంది.
ప్రజాధనాన్ని ఏ నగరంలో ఖర్చు చేస్తే దానివల్ల వచ్చే ఆదాయాన్ని కూడా ఆ నగరంలోనే ఖర్చు చేయాలి. హైదరాబాద్ నగరంలో అలా చేయకపోవడంతో అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కొరత ఎదురవుతోంది. వాస్తవానికి మౌలిక సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు చేస్తే... దీని ఆధారంగా రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం రూ.7వేల కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మిస్తే దానిచుట్టూ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్ల రూపాయల్లో జరగగా, ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానాకు చేరటంతో నగరాభివృద్ధికి నిధులలేమి ఎదురవుతోంది.
ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాకు నగరంలో ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి తేవాలంటే ప్రత్యేకంగా‘అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్’ను ఏర్పాటు చేయడం తప్పని సరి అని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. గ్రేటర్‌తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో సమగ్ర రవాణా వ్యవస్థపై అధ్యయనం జరిపిన లీ అసోసియేట్స్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ (లాసా) సంస్థ రూపొందించిన నివేదికపై ఇటీవల ప్రజాభిప్రాయాలు సేకరించిన హెచ్‌ఎండీఏ ఇక నిధుల సముపార్జనకు కార్య ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)పై దృష్టి సారించింది.
రవాణాపై ‘మహా’ కసరత్తు
Published Sun, Feb 2 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement