జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీచేసే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్...........
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీచేసే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో డి.శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఇటీవల పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను క్రోడీకరించడంతోపాటు, అభ్యర్థుల ఎంపికను నిష్పాక్షికంగా జరిపేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వే రిపోర్టుల పరిశీలనతోపాటు ఆశావహులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన తరవాతనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.