
ఆర్టీసీకి రికార్డుస్థాయి నష్టాలు
♦ రూ.701.80 కోట్లుగా తేలిన లెక్క
♦ గతేడాది కంటే ఏకంగా రూ.300 కోట్లు ఎక్కువగా నష్టాలు
♦ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు హడలిపోతున్న యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల లెక్క తేలింది. రోడ్డు రవాణా సంస్థ ఆవిర్భవించినప్పట్నుంచీ ఎన్నడూ లేనంతగా నష్టాలు మూటగట్టుకుంది. ఉమ్మడి ఆర్టీసీ(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో కన్నా రికార్డు స్థాయి నష్టాలను చవిచూసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీఎస్‌ఆర్టీసీకి ఏకంగా రూ.701.80 కోట్ల నష్టాలు వచ్చాయి. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం లెక్కలను అధికారులు తాజాగా తేల్చారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.300 కోట్లు అధికం. ఇంత భారీ నష్టాలు రావటంతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటేనే ఆర్టీసీ యాజమాన్యం హడలిపోతోంది. అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుని నష్టాలు తగ్గించుకోవాలని పదేపదే సీఎం చంద్రశేఖర్‌రావు చెబుతున్న సమయంలో.. నష్టాలు తగ్గకపోగా రికార్డులను బద్దలుకొట్టే రీతిలో నమోదు కావటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కొంపముంచిన వేతన సవరణ
కిందటి ఆర్థిక సంవత్సరం కంటే కాస్త అటూఇటూగా నష్టాలు ఉండటం సాధారణం. కానీ ఏకంగా ముందటి ఏడాది కంటే రూ.300 కోట్లకుపైగా నష్టాలు అధికంగా నమోదు కావటం అసాధారణం. దీనికి వేతన సవరణే ప్రధాన కారణమని లెక్కలు చెబుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.401 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. కానీ ఈసారి రూ.701.80 కోట్ల నష్టాలు వచ్చాయి. సిబ్బంది జీతభత్యాల పద్దు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒకేసారి ఇంత తేడా నమోదైంది. గత సంవత్సరం ప్రభుత్వం ఆర్టీసీకి 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. దీంతో జీతాల పద్దు అమాంతం పెరిగింది.
అంతకు ముందు సంవత్సరం జీతాల పద్దు రూ.1,844 కోట్లు ఉండగా.. ఈసారి రూ.2493 కోట్లకు చేరింది. అంటే రూ.649 కోట్లు పెరిగిందన్నమాట! ఇందులో వేతన సవరణకు సంబంధించి ఒక విడత బ కాయిల మొత్తం రూ.220 కోట్లు కూడా ఉన్నాయి. అవి తీసేస్తే నికరంగా వేతనాల భారం రూ.429 కోట్లు. పెరిగిన నష్టాలకు ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుదల నమోదు కాలేదు. అంతకుముందు సంవత్సరం ఆదాయం రూ.3,991 కోట్లు కాగా ఈసారి రూ.4,092గా నమోదైంది. డీజిల్ ధర తగ్గటంతో నికరంగా రూ.100 కోట్లు మిగులు కనిపించింది.
మేల్కొనని యాజమాన్యం... దారిచూపని ప్రభుత్వం
జీతాల పెంపుతో సంస్థపై భారం అధికంగా ఉంటుందని ముందే తెలుసు. కానీ ఆ భారాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు వెతకలేకపోయారు. దిక్కులు చూస్తూ మిన్నకుండిపోవటంతో సంస్థను నష్టాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం పెద్దగా ఆదుకోకపోవటం కూడా కారణమైంది. జీతాల భారం పూర్తిగా ఆర్టీసీపై పడనీయమని అప్పట్లో సీఎం స్వయంగా పేర్కొన్నా ప్రభుత్వం మాత్రం ఎక్కడా పట్టించుకున్న దాఖలాల్లేవు.
‘ఉమ్మడి’ రికార్డు బద్దలు
ఆర్టీసీ చరిత్ర లో ఇప్పటి వరకు అతి భారీ నష్టాలు వచ్చిన సంవత్సరంగా 2013-14 రికార్డుకెక్కింది. ఆ సంవత్సరం రూ.989 కోట్ల నష్టాలు వచ్చిపడ్డాయి. అందులో తెలంగాణ వాటా రూ.474.72 కోట్లుగా నమోదైంది. నష్టాల్లో ఏపీ వాటా 52 శాతంగా ఉంది. రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గుతాయని అంతా భావించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టే రీతిలో నష్టాలు నమోదు కావటంతో అటు సంస్థతోపాటు, ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోతోంది.