హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లయిట్లో దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 2 కిలోల కొకైన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సదరు విమానంలోని ప్రయాణికులు కొకైన్ తీసుకువస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు.
అందులోభాగంగా ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే సదరు మహిళపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ... అదుపులోకి తీసుకుని... దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఆ మహిళ వద్ద ఉన్న ఐదు పుస్తకాలకు రెండు వైపులా అల్యూమినియం ఫాయిల్ కవర్లు ఉండడంతో విప్పి చూశారు. దీంతో పుస్తకాల పేపర్లలో కొకైన్ తీసుకువస్తున్నట్లు ఆమె అంగీకరించింది. 2 కేజీల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ. 10 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.