డబ్బు కోసమే.. కాల్పుల ఘాతుకం
► కాటేదాన్ ఫైరింగ్ కేసులో ఇద్దరు యూపీవాసుల అరెస్టు
► 24 గంటల్లోనే కేసును ఛేదించిన సైబరాబాద్ కాప్స్
సాక్షి,సిటీబ్యూరో: సంచలనం సృష్టించిన కాటేదాన్ కాల్పుల కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో నిందితులైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ శర్మ, అతడికి సహకరించిన వికాశ్ కుమార్ జాట్‌లను శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పహడీషరీఫ్ ఠాణాలో బుధవారం శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కలిసి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు. యూపీకి చెందిన రాహుల్, వికాస్‌లు ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి జాల్‌పల్లిలోని శ్రీరామ్ కాల నీలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
దినసరి వేతనంపై మెషీన్ టెక్నీషియన్‌గా రాహుల్ శర్మ, ప్రైవేట్ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా వికాస్ కుమార్ పని చేస్తున్నారు. యూపీలో జరిగిన ఓ హత్య కేసులో రాహుల్ శర్మ నిందితుడుగా ఉన్నాడు, అక్కడే ఉంటే నేరప్రవృత్తిలోకి దిగుతాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌కు పంపించారు. అయితే ఇక్కడ ఉపాధి ద్వారా అనుకున్న మొత్తం లో డబ్బులు రాకపోవడంతో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాటేదాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఎదురుగా ఉన్న జియో సంసార్ కార్యాలయంలో మూడుసార్లు రెక్కీ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బైక్‌పై వికాస్‌కుమార్‌తో కలిసి రాహుల్ శర్మ అక్కడికి చేరుకున్నాడు.
బయటి కదలికలను గమనించేందుకు వికాస్ కుమార్ బైక్‌పై బయట వేచి ఉండగా, కార్యాల యం లోపలికి వెళ్లిన రాహుల్ శర్మ యూపీలోని ఫిరోజాజాబాద్ జిల్లా మఖాన్‌పూర్ ఎస్‌బీఐలోని ఓ ఖాతాలో రూ.500 డిపాజిట్ చేయమని అక్కడి ఉద్యోగి ప్రసాద్‌ను కోరాడు. ఈ లావాదేవీ అయిపోయే లోపే రాహుల్ శర్మ తన వెంట తెచ్చుకున్న నాటుతుపాకీతో ప్రసా ద్ ఛాతీపై కాల్చాడు. అయితే ఆలోపే ప్రసాద్ తేరుకోవడంతో రాహుల్ శర్మ బయటకు వచ్చి వికాస్ కుమార్‌తో కలిసి బైక్‌పై పరారయ్యాడు. అతడి బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఫోన్ కాల్ డేటాను అనాలాసిస్ చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
‘రీచార్జే’ పట్టించింది...
నిందితుడు రాహుల్ శర్మ వినియోగిస్తు న్న సెల్‌ఫోన్‌ను కాల్పులు జరగగానే స్విచ్ఛాఫ్ చేశాడు. ఆ తర్వాత అందరికీ తెలిసిన పాత నంబర్ తీసేసి, కొత్త నంబ ర్ వాడాడు. అయితే ఆన్‌లైన్ రీచార్జ్ కన్‌ఫర్మ్ కోసం అతడిచ్చిన మెయిల్ ఐడీ రాహుల్ శర్మను పట్టుకునేలా చేయడం లో పోలీసులకు ఉపయోగపడింది. అతని మెయిల్ ఐడీని పరిశీలించిన పోలీసులకు తాజాగా అతడు రీచార్జ్ చేసిన నంబర్లను ట్రాక్ చేశారు. దీంతో అతడిని జాల్‌పల్లిలోని శ్రీరామ్ కాలనీలోనే పట్టుకోగలిగారు.