ఈ ఏడాది వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మాండం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.
'ఆంధ్రప్రదేశ్ లో పాలకులు స్వార్థాన్ని వీడితేనే అభివృద్ధి. పాలకులకు గ్రహాలు అనుకూలించడం లేదు. అకాల వర్షాల వల్ల నష్టాలు, పరిపాలన ఇబ్బందులు తలెత్తుతాయి. వైఎస్ఆర్ సీపీకి ఈ ఏడాది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పార్టీ ఫిరాయించినవారికి రాజకీయంగా భవిష్యత్ లేదు. అక్రమ కేసులు, కుట్రలు కుతంత్రాలు నుంచి వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయపపడతారు. వైఎస్ఆర్ సీపీ మరింతగా ప్రజల మన్నన చూరగొంటుంది. రాబోయే రోజుల్లో యువ నాయకత్వానిదే భవిష్యత్' అని మారేపల్లి పంచాంగం చెప్పారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ఉగాది ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలన్నారు. అంతకు ముందు ఆయన 'శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతీ తెలుగు ఇంటికి శాంతి సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని ట్విట్ చేశారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగువారికి శుభం కలగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.