తెలంగాణ మరో కశ్మీర్ అయ్యేది: దత్తాత్రేయ
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోక పోతే తెలంగాణ మరో కశ్మీర్ అయ్యేదని కేంద్ర మంత్రి బండారు దత్రాత్రేయ అన్నారు. నిజాం నిరంకుళ పాలనను అంతం చేసిన ఘనత పటేల్ దే అని గుర్తుచేశారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు నాంపల్లి లోని కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పమని, దానికి బీజేపీ, తాను సహాయం చేస్తామన్నారు. నైపుణ్య శిక్షణకు ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోడీ పథకాలు అనేకం ఉన్నాయని అన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని పట్టుదలతో ఉన్నామని ఆయన చెప్పారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం సాయం చేస్తున్నప్పటికీ హైదరాబాద్ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, హైదరాబాద్‌కు 39వేల ఇళ్లు మంజూరైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని దత్తాత్రేయ అన్నారు. కాగా వల్లభాయ్ పటేల్ జయంతిని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారకంగా నిర్వహించకపోవడం దారుణమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.