ఫిట్‌‘లెస్’పై నజర్ | Unsafe school buses criminal cases | Sakshi
Sakshi News home page

ఫిట్‌‘లెస్’పై నజర్

Published Wed, Jun 8 2016 11:28 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

ఫిట్‌‘లెస్’పై నజర్ - Sakshi

ఫిట్‌‘లెస్’పై నజర్

భద్రతలేని బడి బస్సులపై క్రిమినల్ కేసులు
పిల్లలతో రోడ్డెక్కితే పర్మిట్ రద్దు       
కార్యాచరణకు సిద్ధమైన ఆర్టీఏ

 

సిటీబ్యూరో: మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇప్పటి దాకా పిల్లల అడ్మిషన్ల కోసం హైరానా పడ్డ తల్లిదండ్రులకు ఇప్పుడు వారిని తీసుకెళ్లే బస్సులపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రత లేని బడి బస్సులపై ఆర్టీఏ దృష్టి సారించింది. ఫిట్‌నెస్ లేకుండా పిల్లలను తరలించే పాఠశాల యాజమాన్యాలపై ఇక నుంచి క్రిమినల్ కేసులు నమోదు చేసి పర్మిట్లను రద్దు చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. అలాంటి బస్సులను నడిపే డ్రైవర్ల డ్రైవింగ్ లెసైన్సును సైతం మూడు నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను సైతం ఏర్పాటు చేశారు. తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరగడం, బస్సుల కండిషన్ లోపాలు బయటపడడం పరిపాటిగా మారింది. ఇక నుంచి అలాంటి బస్సుల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏకంగా పర్మిట్లను రద్దు చేస్తారు.

 
శివార్లలోనే అధికం..

ఎక్కువ శాతం స్కూళ్లు, కళాశాలలు నగర శివార్లలోనే ఉన్నాయి. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలించేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు చెందిన వాహనాలపై అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఉప్పల్,  ఇబ్రహీంపట్నం, మేడ్చెల్, అత్తాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. జూన్ 13 నుంచి పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని స్కూల్, కళాశాల బస్సులు వెంటనే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.

 
ఈ నిబంధనలు తప్పనిసరి..

{పతి స్కూలు, కళాశాల బస్సు పసుపు రంగులో ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించే విధంగా కాన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సు లోపలి భాగంలో పెద్ద పారదర్శక అద్దం ఏర్పాటు చేయాలి. బస్సు ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్), పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం తప్పనిసరి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి.

     
సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపు ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకునే విధంగా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకునేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి. వాహనానికి నాలుగువైపులా పైభాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటి వైపు యాంబర్ (గాఢ పసుపు పచ్చని) రంగు గల  ఫ్లాపింగ్ లైట్లను అమర్చాలి. పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.

     
సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసే విధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250 ఎంఎంకు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థులు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) చిత్రాలు నల్లరంగులో చిత్రించాలి. ఆ చిత్రం కింద ‘స్కూల్ బస్సు/ కళాశాల బస్సు’ అని నల్ల రంగులో 100 ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11 ఎంఎం ఉండాలి. బస్సు తలుపులకు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్ తప్పనిసరి. సైడ్ విండోలకు అడ్డంగా మూడు లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎంఎం ఎత్తుకు మించరాదు. అన్ని మెటన్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రెయిలింగ్ ఉండాలి.

 

కఠిన చర్యలు తప్పవు..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 10,022 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 7,150 బస్సులకు పరీక్షలు పూర్తి చేశాం. మరో 2872 బస్సులు ఫిట్‌నె స్ లేకుండానే తిరుగుతున్నట్టు గుర్తించాం. ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కాకుండా ఉన్న బస్సులు వెంటనే  సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో ఫిట్ నెస్ పరీక్షలు చేసుకుని సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ విషయమై ఇప్పటికే పాఠశాలల యాజమాన్యాలకు సూచిం చాం. తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 
- టి.రఘునాథ్, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement