
ఆదాయం ఉంటేనే..!
39 పార్కులపై హెచ్‌ఎండీఏ విముఖత
వాటిని స్వీకరించేందుకు జీహెచ్‌ఎంసీ నో...
అయోమయంలో కాలనీ పార్కుల నిర్వహణ
సిటీబ్యూరో : మహా నగరంలో పచ్చద నాన్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఓవైపు ప్రభుత్వం ‘హరిత హారాన్ని’ అమలు చేస్తుండగా... మరోవైపు కాలనీల్లోని పార్కులు నిరాదరణకు గురవుతున్నాయి. ఆదాయంలేని పార్కులు తమకొద్దంటే... తమకొద్దంటూ స్థానిక సంస్థలు విముఖత వ్యక్తం చేస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 39 కాలనీ పార్కుల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం వాటి బాగోగులు చూస్తోన్న హెచ్‌ఎండీఏ వాటిని వదిలించుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని 39 కాలనీ పార్కులను జీహెచ్‌ఎంసీకి బదలాయించాలని గత ఫిబ్రవరిలో జరిగిన హెచ్‌ఎండీఏ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మాణించింది.
ఆయా పార్కులు, రోడ్ మీడియన్ల నిర్వహణ బాధ్యతను ఏప్రిల్ 1 నుంచే జీహెచ్‌ఎంసీకి అప్పజెప్పాలని అప్పట్లో ముహూర్తం కూడా ఖరారు చేసింది. అయితే... నిర్వహణ బాధ్యతను స్వీకరించేందుకు జీహెచ్‌ఎంసీ ముందుకు రాకపోవడం హెచ్‌ఎండీఏకు మింగుడు పడడంలేదు. ఈ విషయమై అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు అధికారికంగా (డీఓఎల్) లేఖ రాసినా జీహెచ్‌ఎంసీ నుంచి కనీస స్పందన లేదని వాపోతున్నారు. గ్రేటర్‌లో పార్కులను అభివృద్ధి చేసి ఇవ్వడమే హెచ్‌ఎండీఏ బాధ్యత అని, వాటి నిర్వహణ జీహెచ్‌ఎంసీఏ చేపట్టాలని బీపీపీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎల్బీనగర్, సరూర్‌నగర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఓపెన్ పార్కులను జీహెచ్‌ఎంసీకే అప్పగించిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. గ్రేటర్‌లోని వివిధ కాలనీల్లో అభివృద్ధి చేసిన 39 పార్కులు, పలు రోడ్లు, ఫ్లై ఓవర్ల కింద ఉన్న మీడియన్ల నిర్వహణకు ఏడాదికి రూ.5కోట్ల వరకు ఖర్చవుతోంది. అయితే... ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా పార్కులను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని చూస్తుండగా, బాధ్యతను చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఆసక్తి చూపట్లేదు.
వాటిని కూడా ఇస్తే...
గ్రేటర్‌లోని కాలనీ పార్కులను తీసుకొనేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, వాటితో పటు కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులను కూడా తమకే అప్పగించాలని జీహెచ్‌ఎంసీ కోరుతోంది. వీటిని తమకు బదలాయిస్తేనే మిగతా 39 పార్కుల నిర్వహణ బాధ్యతను చేపడతామని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి తెగేసి చెబుతున్నట్లు వినికిడి. అయితే... వీటిలో కే బీఆర్ పార్కును జీహెచ్‌ఎంసీకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులను ఇవ్వడం సాధ్యం కాదని, ఇవి బీపీపీ అథార్టీలోని పార్కులైనందున వాటి నిర్వహణ బాధ్యత కూడా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండటమే సమంజసమని వారు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాటిని జీహెచ్‌ఎంసీకి అప్పగించే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేస్తున్నారు. అసలు విషయం ఏమంటే... హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సందర్శనీయ ప్రాంతాలుగా సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, లేజర్ షోలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.15కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతోనే ఇప్పుడు హెచ్‌ఎండీఏ మనుగడ సాధిస్తోంది. అందుకే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ మూడు పార్కులను వదులుకొనేందుకు హెచ్‌ఎండీఏ ససేమిరా అంటోంది. అయితే... జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి మాత్రం వాటి ద్వారా వచ్చే ఆదాయంపైనే గురిపెట్టి ఎలాగైనా వాటిని దక్కించుకొనేందుకు కాలనీ పార్కుల బదలాయింపు వ్యవహారాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుతున్నట్లు సమాచారం.