ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోదీ
యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకే ఉత్తరాఖండ్, అరుణాచల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను అకారణంగా రద్దు చేశారని ఆరోపించారు. హెచ్‌సీయూలో జరిగిన దారుణాలకు బీజేపీ పాలనే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.