రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు
కేసీఆర్‌కు ఉత్తమ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎన్నో పోరాటాలతో సాధించిన స్వరాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శవంతంగా, పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని భావించిన ప్రజల ఆశలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వమ్ము చేశారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులపై దాడులు, అత్యాచా రాలు, హత్యలు, అఘాయిత్యాలు నిరంతరంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హరిత తెలంగాణ, బంగారు తెలంగాణ, ఆదర్శ తెలంగాణ, సామాజిక తెలంగాణ అంటూ కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోగా వారి హక్కులను అధికార పార్టీ నాయకులు హరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న 3500 మంది రైతుల్లో మెజారిటీగా దళిత, గిరిజన రైతులే ఉన్నారని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పలు సంస్థలు సేకరించిన వివరాలను పరిశీలిస్తే భయంకరమైన నిజాలు వెల్లడయ్యాయన్నా రు. 2014 నుంచి 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 1592, మహిళలపై అత్యాచార కేసులు 502, హత్య కేసులు 120 నమోదయ్యాయని చెప్పారు. 2016 నాటికి దళితులు, గిరిజనులపై 5,210 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.