ఒక్క ఆధారమైనా ఉందా?
జగన్‌పై ఆరోపణలకు దిగడంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘‘తుని సంఘటన జరిగి ఎన్ని రోజులైంది. ఒక్క ఆధారం కూడా చూపకుండానే ఆ ఘటనకు కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఒకే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని కనీసం ఒక్క ఆధారమైనా చూపలేదు. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతి సందర్భంలోనూ ప్రజలకు శత్రువును చేయాలన్న ఉద్దేశమే ముఖ్యమంత్రిది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతపై అవసరం ఉన్నా లేకపోయినా.. ఆధారం లేకపోయినా అదే పనిగా ఆరోపణలు చేయడం చూస్తుంటే చంద్రబాబుది ఎంత క్రిమినల్ మనస్తత్వమో బయటపడుతోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా.. ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి ఏది ఎదురైనా వెంటనే ఆ బురదను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అంటించడమన్నది చంద్రబాబు రెండేళ్లగా అమలు చేస్తున్న విధానమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నేతపై పదేపదే ఆరోపణలు చేయడం విజ్ఞత అనిపించుకోదన్నారు. తుని ఘటనలపై ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రికి దమ్ముంటే వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు.