మరో పాకిస్తాన్‌కు దారితీస్తుంది
మతప్రాతిపదికన రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి వెంకయ్య హెచ్చరిక
- వాటి వల్ల సామాజిక అశాంతి చోటుచేసుకుంటుందని వ్యాఖ్య
- సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన మరో పాకిస్తాన్‌కు దారితీస్తుందని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హెచ్చరించారు. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని, గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడూ తమ పార్టీ వ్యతిరేకించిందని ఆయన గుర్తుచేశారు. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారితీస్తాయని... వాటి వల్ల వివిధ వర్గాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పాటు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తాయన్నారు. ఇటువంటి రిజర్వేషన్లను భారత రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లలో వివక్ష లేదా? మరి రిజర్వేషన్లు ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద దళిత మోర్చా నేత వేముల అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకయ్య ప్రసంగించారు.
దళితులు, ముస్లింల వెనుకబాటుకు కాంగ్రెసే కారణం...
మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేడ్కర్ వ్యతిరేకించారని, మహాత్మా గాంధీ మాతమార్పిళ్లను వ్యతిరేకించారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల కల్పనకు బీజేపీ అనుకూలమన్నారు. దళితులు, ముస్లింలలో వెనుకబాటుదనానికి కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. స్వతంత్ర ఆలోచనలున్న అంబేడ్కర్‌కు కాంగ్రెస్ ఏనాడు మద్దతివ్వలేదని విమర్శించారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు యూపీ ఎన్నికల ఫలితాలతో కాలం చెల్లిందన్నారు. ప్రజాస్వామ్యం పటిష్టం కావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కులవివక్ష పోయి సామాజిక సామరస్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.
అంబేడ్కర్ అడుగుజాడల్లో మోదీ:కేంద్ర మంత్రి దత్తాత్రేయ
అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా బి.ఆర్. అంబేడ్కర్ నిలిచారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో మోదీ సాగుతున్నారన్నారు. దళితుల కోసం కేంద్రం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలంగాణలో గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా తెలంగాణ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు తెస్తోందని బీజేపీ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా రాజకీయంగా పోరాడతామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ రిజర్వేషన్ల కల్పనను బీజేపీ అడ్డుకొని తీరుతుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు న్యాయం జరగాలంటే ఇటువంటి చర్యలను అడ్డుకోవాల్సి ఉందన్నారు. అంటరానితనంపై పోరాడిన సామాజిక విప్లవ యోధుడు అంబేడ్కర్ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి కొనియాడారు. కార్యక్రమంలో బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎన్.రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, యండెల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి, టి. ఆచారి, ఎస్.కుమార్, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.