
ఒక పార్టీకి ఇబ్బందని చట్టం చేయాలా?
ఫిరాయింపులపై వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ‘ఒక పార్టీకి ఇబ్బంది కలిగిందని ఫిరాయింపులపై మరో చట్టం తేవాలా’ అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సోమవారం మీడియా సమావేశంలో ఏపీలో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టిన నేపథ్యంలో ఇటువంటి వాటిపై చట్టం తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా అన్న ఒక విలేకరి ప్రశ్నకు వెంకయ్య ఈ విధంగా స్పందించారు. కాగా, ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాక ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించి అసలుసిసలైన జాతీయపార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్, వామపక్షాలు ప్రజాతీర్పును అర్థం చేసుకోలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
మతపరమైన రిజర్వేషన్లు నిలబడవు..
తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికోసం చేస్తున్న ప్రయత్నాలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధం గా నిలబడవని ఒక ప్రశ్నకు వెంకయ్య బదు లిచ్చారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగాన్ని రూ పొందించే సమయంలోనే అంబేడ్కర్, వల్ల భాయ్ పటేల్ వంటి వారు దీనిని తిరస్క రిం చారన్నారు. సమావేశంలో నేతలు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, సీహెచ్.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
‘బడుగు వర్గాల అభ్యున్నతే మా లక్ష్యం’
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలను అభివృద్ధి చేసేందుకు జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కులను కేంద్రం కల్పించిందన్నారు. ప్రస్తుతం ఉన్న పేరిటే కమిషన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా బీసీ సంఘ ప్రతినిధులు మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సంఘ ప్రతినిధులు గుజ్జ కృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.