దేశంలో ఉప్పు కొరత వట్టి వదంతే..
చర్చావేదికలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: అవినీతి, నల్లధనం నిర్మూలనలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓ విప్లవాత్మకమైన అడుగని, దేశంలో ఉప్పు కొరత లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రోజుల్లో కొత్త నోట్లు వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శనివారం ఏర్పాటు చేసిన చర్చావేదికలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తగినంత డబ్బు బ్యాంకుల్లో ఉందని ఎవరూ భయపడవద్దన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో పన్నుకట్టే తత్వం పెరుగుతుందన్నారు. 15 వేల జనాభాకు ఒక బ్యాంక్ బ్రాంచి చొçప్పున ఉన్నాయని.. బ్యాంకు సిబ్బంది కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నారన్నారు.పన్నులు కట్టకుండా ప్రజల్ని దోచుకున్న వారికి మాత్రమే ఈ నిర్ణయం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ చర్యతో ద్రవ్వోల్బణం తగ్గి, ధరలు మరింత తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు.
కానీ దీన్ని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. దీర్ఘకాలిక, విప్లవాత్మకమైన యజ్ఞం తలపెట్టిన ప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. ఈ నోట్ల రద్దుతో పాకిస్తాన్ కుట్రలకు తెరపడిందన్నారు. అలాగే ఉప్పు కొరత వదంతులను కొట్టిపారేస్తూ దేశంలో 285 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంటే, కేవలం 60 లక్షల టన్నులు మాత్రమే ఉపయోగించుకుంటున్నా మన్నారు. అవినీతి క్యాన్సర్ లాంటిదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సామాన్యులకు చేరాల్సిన సంక్షేమ పథకాల అమలులో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంద న్నారు. సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
పెద్ద నోట్ల రద్దు విప్లవాత్మక నిర్ణయం
Published Sun, Nov 13 2016 3:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
Advertisement
Advertisement