కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్
ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ కరివేపాకులా వాడుకుంటోందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఆయన వీలైనంత త్వరగా గుర్తించాలని హితవు పలికారు. మంగళవారం వేణుగోపాలాచారి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. టీజేఏసీ ముసుగులో కోదండరాం, కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై 32 కేసులు, ఇతర ప్రాజెక్టులపై 192 కేసులు దాఖలు చేసి అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని అన్నారు. దీనికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నంద్యాల ఉపఎన్నిక మాదిరిగానే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు.