Venugopalachari
-
‘బద్ధవ్యతిరేకులతో స్నేహమా?’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ద్రోహి అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతి నిధి వేణుగోపాల చారి తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే యావత్తు తెలంగాణ జాతి క్షమించదన్నారు. నాలుగేళ్లుగా ఎన్నికలకు పోదామంటూ సవాళ్లు విసిరిన కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీలు ఇప్పుడు ఓటర్ల జాబితా తప్పులతడక అంటూ ఎందుకు వెనకాడుతున్నాయని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, సీపీఎస్ రద్దు అంటూ హామీలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ముందు ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ హామీలను అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. అధికార దాహంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. -
ఉనికి కోసమే ఉత్తమ్ కుమార్ యాత్రలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ రైతు బాట పేరిట యాత్రలు చేపడుతున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కళ్లు ఉండి కూడా రాష్ట్ర అభివృద్ధిని చూడలేని గుడ్డివాళ్లు కాంగ్రెస్ నాయకులని ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి, క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే రైతు సమితులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా రాజకీయం చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని వేణుగోపాలచారి ఆరోపించారు. -
కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్
ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ కరివేపాకులా వాడుకుంటోందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఆయన వీలైనంత త్వరగా గుర్తించాలని హితవు పలికారు. మంగళవారం వేణుగోపాలాచారి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. టీజేఏసీ ముసుగులో కోదండరాం, కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై 32 కేసులు, ఇతర ప్రాజెక్టులపై 192 కేసులు దాఖలు చేసి అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని అన్నారు. దీనికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నంద్యాల ఉపఎన్నిక మాదిరిగానే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. -
'సింగరేణి కార్మికులు సమ్మె విరమించాలి'
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాలా చారి అన్నారు. కోల్ ఇండియా సమస్యలు వేరు, సింగరేణి సమస్యలు వేరని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. సంబంధం లేని కారణాలతో సింగరేణి కార్మికులు సమ్మె చేయడం తగదన్నారు. విద్యుత్ సంక్షోభ సమయంలో సింగరేణి కార్మికుల సమ్మె తగదని వేణుగోపాలాచారి వ్యాఖ్యానించారు. వెంటనే సింగరేణి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన కోరారు. -
‘ఢిల్లీ’ నేతకు గల్లీలో గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కేంద్ర మంత్రిగా పనిచేసి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వేణుగోపాలచారికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లా రాజకీయాలతోపాటు సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం ఎపిసోడే ఇందుకు ఉదాహరణ. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన డీసీసీబీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిని వెనకుండి నడిపించింది చారీనే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తన అనుచరునికి డీసీసీబీ పదవి ఇప్పించుకుని తన ప్రభావాన్ని పెంచుకునేలా పావులు కదిపిన చారికి పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం చెక్ పెట్టింది. జిల్లా మంత్రి జోగు రామన్న చైర్మన్ దామోదర్‌రెడ్డికి అండగా నిలవడంతో ఈ అవిశ్వాసం అంశం అభాసుపాలైంది. ఇది చంద్రశేఖర్‌రెడ్డి కంటే చారి రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసిందనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లోకి రావడంతో సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు చెక్ పడినట్లయింది. నియోజకవర్గంలో అసలే నామమాత్రంగా ఉన్న ఆయన క్యాడర్ విఠల్‌రెడ్డి రాకతో చాలా మట్టుకు కనుమరుగవుతుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. సీనియర్ నేతగా పేరున్న వేణుగోపాలచారికి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా అధినేతతో ఉన్న సంబంధాలతో క్యాబినేట్ స్థాయి పదవిని పొందగలిగారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. జిల్లాకు వచ్చేసరికి మాత్రం తన ప్రభావాన్ని చూపకోలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన జిల్లా రాజకీయాలను శాసించేవారు. తన వర్గాన్ని పెంచుకునే పనిలో.. డీసీసీబీ ఎపిసోడ్.. విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లోకి రాక.. తదితర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తన పట్టును పెంచుకునే పనిలో వేణుగోపాలచారి పడినట్లు తెలుస్తోంది. ఇందు కోసం జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఓ అనుచరవర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. పక్షం రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గానికి వెళ్లిన చారి రోజంతా అక్కడే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రోజు మంత్రి రామన్న కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగంపై కూడా పట్టు సాధించేందుకు చారి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఆయన కొందరు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ సమీక్షలకు మీరు ఎలా వెళతారని అధికార పార్టీలోని మరో వర్గం నేతలు అధికారులతో అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు ఇరుకున పడుతున్నట్లు తెలుస్తోంది.