సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కేంద్ర మంత్రిగా పనిచేసి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వేణుగోపాలచారికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లా రాజకీయాలతోపాటు సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం ఎపిసోడే ఇందుకు ఉదాహరణ. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన డీసీసీబీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిని వెనకుండి నడిపించింది చారీనే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.
తన అనుచరునికి డీసీసీబీ పదవి ఇప్పించుకుని తన ప్రభావాన్ని పెంచుకునేలా పావులు కదిపిన చారికి పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం చెక్ పెట్టింది. జిల్లా మంత్రి జోగు రామన్న చైర్మన్ దామోదర్‌రెడ్డికి అండగా నిలవడంతో ఈ అవిశ్వాసం అంశం అభాసుపాలైంది. ఇది చంద్రశేఖర్‌రెడ్డి కంటే చారి రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసిందనే అభిప్రాయం టీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి రావడంతో సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు చెక్ పడినట్లయింది.
నియోజకవర్గంలో అసలే నామమాత్రంగా ఉన్న ఆయన క్యాడర్ విఠల్‌రెడ్డి రాకతో చాలా మట్టుకు కనుమరుగవుతుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. సీనియర్ నేతగా పేరున్న వేణుగోపాలచారికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా అధినేతతో ఉన్న సంబంధాలతో క్యాబినేట్ స్థాయి పదవిని పొందగలిగారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. జిల్లాకు వచ్చేసరికి మాత్రం తన ప్రభావాన్ని చూపకోలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన జిల్లా రాజకీయాలను శాసించేవారు.
తన వర్గాన్ని పెంచుకునే పనిలో..
డీసీసీబీ ఎపిసోడ్.. విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రాక.. తదితర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తన పట్టును పెంచుకునే పనిలో వేణుగోపాలచారి పడినట్లు తెలుస్తోంది. ఇందు కోసం జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఓ అనుచరవర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. పక్షం రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గానికి వెళ్లిన చారి రోజంతా అక్కడే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అదే రోజు మంత్రి రామన్న కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగంపై కూడా పట్టు సాధించేందుకు చారి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఆయన కొందరు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ సమీక్షలకు మీరు ఎలా వెళతారని అధికార పార్టీలోని మరో వర్గం నేతలు అధికారులతో అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు ఇరుకున పడుతున్నట్లు తెలుస్తోంది.
‘ఢిల్లీ’ నేతకు గల్లీలో గడ్డుకాలం
Published Mon, Aug 25 2014 1:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement