సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ రైతు బాట పేరిట యాత్రలు చేపడుతున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమ కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కళ్లు ఉండి కూడా రాష్ట్ర అభివృద్ధిని చూడలేని గుడ్డివాళ్లు కాంగ్రెస్ నాయకులని ఆయన మండిపడ్డారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి, క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే రైతు సమితులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా రాజకీయం చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని వేణుగోపాలచారి ఆరోపించారు.