పోలవరం వాటాలు తేల్చేలా ఆదేశాలివ్వండి
కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శితో విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరి ష్కరించేందుకు ఏర్పాటైన ఏకే బజాజ్ కమిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చి పోలవరం, పట్టిసీమ వాటాలు తేల్చేలా చూడాలని కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు ఆర్.విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం ఢిల్లీలో అమర్‌జీత్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన.. బజాజ్ కమిటీ విధులపై చర్చించారు.
పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటిలో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలను కమిటీ తేల్చాలని పేర్కొన్నా, ఆ అంశం తమ పరిధిలోకి రాదంటూ కమిటీ ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భం గా చేసిన వ్యాఖ్యలను అర్‌జీత్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేందుకు చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కా లిక కేటాయింపులు చేసి, నిర్దిష్ట వాటా చెప్పాల్సిన బాధ్యత కమిటీపై ఉందని.. అది పట్టించుకోకుండా విధివిధానాలంటే కమిటీ ఏర్పాటుకు అర్థం లేదని వివరించారు. అమర్‌జీత్‌సింగ్ స్పందిస్తూ.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, కమిటీ పెద్దలతో మాట్లాడతానని స్పష్టం చేసినట్లుగా సమాచారం.