గ్రేటర్‌లోనూ ‘వరంగల్’ ఫలితాలే: నాయిని
మన్సూరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం అవుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మన్సూరాబాద్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నిక ప్రతిపక్షాలకు కనువిప్పు అన్నారు. ఇది సీఎం కేసీఆర్ విజయమని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలు ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ధిచెప్పారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీని విజయం వైపు నడిపించాయని అన్నారు.
గ్రేటర్ ప్రజల్లో మార్పు వచ్చిందని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే పక్క రాష్ర్ట ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఎం.రాంమోహన్‌గౌడ్, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్‌యాదవ్, మజీ కౌన్సిలర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, మల్లారపు శాలిని, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.