నీరు...రానీరు
గ్రేటర్ గ్రిడ్‌కు మొండి చేయి
తాగునీటి పథకాలకు గ్రహణం
మహా నగర దాహార్తిపై సర్కారు నిర్లక్ష్యం
సిటీబ్యూరో: ‘రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్‌లో ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తాం’... ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నగరానికి చెందిన మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిత్యం ఏదో ఒక సందర్భంలో నగర వాసులకు ఇస్తున్న వాగ్దానమిది. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నీళ్లిచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. మహా నగర దాహార్తిని తీర్చేందుకు జలమండలి సిద్ధం చేసిన కీలక మంచినీటి పథకాలపై సర్కారు శీతకన్ను వేయడంతో వీటిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గ్రేటర్ మంచినీటి ముఖచిత్రం పరిశీలిస్తే.. మహా నగరంలో సుమారు 22 లక్షల భవంతులు ఉండగా.. వీటిలో నల్లా కనెక్షన్లు ఉన్నవారు కేవలం 8.64 లక్షలు మాత్రమే. మిగిలిన ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా బోరుబావులు, ప్రైవేటు ఫిల్టర్ ప్లాంట్లు, ట్యాంకర్ నీళ్లపై ఆధార పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీరందరికీ కుళాయి నీళ్లు అందని ద్రాక్షగా మారాయి.
‘మహా’ నిర్లక్ష్యం... గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలకు మంచినీటి సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జలమండలి మంచినీటి సరఫరా పైప్‌లైన్ నెట్‌వర్క్, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది మంది దాహార్తితో అలమటిస్తున్నారు. దీని నుంచి బయట పడేందుకు జలమండలి అధికారులు మంచినీటి పథకాలను పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. వీటిలో ఏ ఒక్క పథకానికీ రాష్ట్ర సర్కారు మోక్షం కల్పించలేదు. దీంతో ఇంటింటికీ నల్లా నీరు అందించడం తీరని కలగా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.