'అది డబ్బున్న వాళ్ల కుంభకోణం'
హైదరాబాద్: ఎంసెట్ 2 లీక్ డబ్బున్న వాళ్లు చేసిన కుంభకోణం తప్ప పేద విద్యార్థులు చేసింది కాదని ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. వారికోసం పేద విద్యార్థులను బలి చేయొద్దని అన్నారు. ఎలాగో వారిని ఎంసెట్ 3 పరీక్షకు అనుమతించనందున ప్రత్యేకంగా పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన పనిలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలు తిరిగి పరీక్ష రాయలేరని అన్నారు. ఎంసెట్ పరీక్ష మరోసారి నిర్వహించొద్దని విజ్ఞప్తి చేస్తూ కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు విద్యార్థులు స్పందించారు. ప్రస్తుతం ఎంసెట్ పరీక్షను రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టొద్దని అన్నారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధ చెందిన నేటి రోజుల్లో స్కాంకు పాల్పడ్డవారిని గుర్తించడం పెద్ద కష్టం కాదని, దానికోసం పేద విద్యార్థులను బలి చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క విద్యార్థులు స్పందిస్తూ ఎంసెట్ 3 పెడితే తాము రాయనే రాయమని, అవసరం అయితే, 40 రోజులు ఉద్యమం చేస్తామని, దరఖాస్తు కూడా చేసుకోబోమని చెప్పారు. లీక్ కు పాల్పడిన 74 మంది విద్యార్థులను పక్కకు పెట్టి తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు.