
సీఎం ఆఫీస్ ఎదుట విషం తాగి చస్తాం
♦ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బాధితులు
♦ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని డిమాండ్
♦ నేటి నుంచి ధర్నా చౌక్‌లో రిలే దీక్షలు
హైదరాబాద్: అక్రమ వడ్డీ వ్యాపారానికి పాల్పడి.. తమ ఆస్తులను హస్తగతం చేసుకున్న మోహన్‌రెడ్డి ఆగడాలను అడ్డుకుని తగిన న్యాయం చేయకపోతే సీఎం కేసీఆర్ కార్యాలయం ముందే విషం తాగి చస్తామని బాధితులు హెచ్చరించారు. అలాగే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్ రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, బాధితులు లక్ష్మి, ముజీబ్, స్వప్న, సరోజలు మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో 20 ఏళ్లుగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న మోహన్‌రెడ్డి తనఖా పేరుతో, అప్పు పేరుతో తమ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు.
హైదరాబాద్, బెంగుళూరు, అమరావతి, తదితర ప్రాంతాల్లో సుమారు 432 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మోహన్‌రెడ్డి బినామీల పేరుతో ఆస్తులు రిజిస్ట్రర్ అయ్యాయని తెలిపారు. ఇలా సుమారు రూ.1000 కోట్ల బినామీ ఆస్తులను ఆయన సంపాదించాడని ఆరోపించారు. ఎదురు తిరిగిన బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సివిల్ పోలీసులు, సీఐడీ, ఏసీబీ లాంటి విభాగాల అధికారులు విచారణ చేసినా మోహన్‌రెడ్డి ప్రభావితం చేయగలుగుతాడని విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి స్పందించి మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇకపై హైదరాబాద్‌లోనే ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. మోహన్‌రెడ్డి, అతని బినామీలు, గూండాల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.