అక్రమ నిర్మాణాలకు చోటివ్వం | We will not give a chance to illegal constructions | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలకు చోటివ్వం

Published Thu, Sep 10 2015 4:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

అక్రమ నిర్మాణాలకు చోటివ్వం

అక్రమ నిర్మాణాలకు చోటివ్వం

సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో భవిష్యత్తులో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూస్తామని... అనుమతుల మంజూరులో సరళీకృత పద్ధతులు ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను అనుమతించేది లేదన్నారు. సర్వీసు రోడ్లు, నాలాలు, చెరువు శిఖం, జీవో నెంబర్ 111కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తలసాని హెచ్చరించారు.

గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ కార్యక్రమాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ విషయమై నిబంధనల రూపకల్పనకు... క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రుల కమిటీ త్వరలో నగర పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులు 2007 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని... వాటి  విషయమై చర్చించామన్నారు. మరోమారు చర్చించాక సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతులకు గతంలో 180 రోజుల గడువు ఉండేదని... దాన్ని 30 రోజులకు కుదించే విషయమై చర్చించామన్నారు.

 స్వచ్ఛ హైదరాబాద్‌కు...
 స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరాన్ని 425 యూనిట్లుగా విభజించి... ఒక్కో యూనిట్‌కు రూ. 50 లక్షల వంతున విడుదల చేశామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగర సమీపంలో రెండు జలాశయాలను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. మార్ట్‌గేజ్ తొలగింపు వంటి విషయాల్లో నిబంధనలు సరళతరం చేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement