Minister T. Padma Rao
-
అక్రమ నిర్మాణాలకు చోటివ్వం
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో భవిష్యత్తులో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూస్తామని... అనుమతుల మంజూరులో సరళీకృత పద్ధతులు ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను అనుమతించేది లేదన్నారు. సర్వీసు రోడ్లు, నాలాలు, చెరువు శిఖం, జీవో నెంబర్ 111కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తలసాని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ కార్యక్రమాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ విషయమై నిబంధనల రూపకల్పనకు... క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రుల కమిటీ త్వరలో నగర పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులు 2007 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని... వాటి విషయమై చర్చించామన్నారు. మరోమారు చర్చించాక సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో అనుమతులకు గతంలో 180 రోజుల గడువు ఉండేదని... దాన్ని 30 రోజులకు కుదించే విషయమై చర్చించామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు... స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరాన్ని 425 యూనిట్లుగా విభజించి... ఒక్కో యూనిట్‌కు రూ. 50 లక్షల వంతున విడుదల చేశామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగర సమీపంలో రెండు జలాశయాలను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. మార్ట్గేజ్ తొలగింపు వంటి విషయాల్లో నిబంధనలు సరళతరం చేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ స్టీఫెన్సన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ‘బాబు’ దుకాణం బంద్
జగదేవ్‌పూర్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శకం తెలంగాణ రాష్ట్రంలో ముగిసిందని, ఆయన ఎన్ని పర్యటనలు చేపట్టినా ఫలితం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు టీడీపీ అవుతోందన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రూ.వేల కోట్లతో మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నీ విజయవంతమయ్యాయన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. వచ్చే ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కొండపోచమ్మ తల్లికి మొక్కుకున్నట్లు చెప్పారు. ఆలయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదవరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, యాదగిరి, హన్మంతరెడ్డి, సర్పంచ్ మల్లయ్య, వెంకటేశం తదతరులు పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో మంత్రి కొండపోచమ్మ అమ్మవారి ఉత్సవాల్లో సోమవారం మంత్రి పద్మారావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ సిబ్బంది మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కుటంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. కొండపోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు మంత్రి చెప్పారు. తరలివస్తున్న భక్తులు - కొండపోచమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సోమవారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తజనం సోమవారం ఉదయమే కొండపోచమ్మ దర్శనం కోసం బయలుదేరారు. - భక్తులు సంప్రదాయ పరంగా కుండల్లో అమ్మవారికి నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య పోతరాజుల ఆటపాటలు, శివసత్తుల శిగాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొండపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం సుమారు 10 వేలకు మందికి పైగా భక్తులు అమ్మవారి సన్నిధికి తరలివచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.