అవినీతికి ఆస్కారమివ్వం | We will not give a chance to the corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి ఆస్కారమివ్వం

Published Fri, Apr 1 2016 2:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

అవినీతికి ఆస్కారమివ్వం - Sakshi

అవినీతికి ఆస్కారమివ్వం

శాసనసభలో సభ్యుల సందేహాలకు సీఎం సమాధానం

♦ ఈపీసీకి కాలం చెల్లింది... మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల జోలికి వెళ్లం
♦ పారదర్శకంగా సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు
♦ అసెంబ్లీలో ప్రజెంటేషన్ అంటే అన్ని పార్టీలను పరిగణనలోకి తీసుకున్నట్లే
♦ ఈ దుస్థితికి కారణమైనందునే కాంగ్రెస్, టీడీపీ నేతలు ముఖం చాటేశారు
♦ ఎత్తిపోతలకు విద్యుత్ ఖర్చుపై భయపడాల్సిందేమీ లేదని వ్యాఖ్య
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి ఆస్కారమివ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈపీసీ విధానం గతంలో తీవ్ర ఆరోపణలకు, విమర్శలకు కారణమైన నేపథ్యంలో దానిని రద్దు చేశామని... కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులకు దానిని వర్తింపజేసే అవకాశం లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ప్రాణాలు పోయినా సరే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. రాజకీయ అవినీతిని పారదోలామని, సచివాలయంలో పైరవీకారులు, కాంట్రాక్టర్లు కనిపించడం లేదని చెప్పారు. శాసనసభలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ అనంతరం సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలను సీఎం కేసీఆర్ నివృత్తి చేశారు.

 అడ్వాన్సులు తీసుకుని చేతులెత్తేశారు
 గతంలో పనులు ప్రారంభించకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారని... పనికిరాని కొందరు కాంట్రాక్టర్లు ఎక్కువ లెస్‌కు టెండర్లు దక్కించుకొని పనులు చేయలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి అవకతవకలకు అవకాశం ఉండదన్నారు. మిడ్‌మానేరు పనుల్లో ఓ కాంట్రాక్టరు 21 శాతం లెస్‌కు పనులు దక్కించుకున్నాడని... తాను పనులు చేయకుండా, మరొకరిని చేయనీయకుండా సాగదీస్తున్నారని పేర్కొన్నారు. ఆ పనులు మూడేళ్ల కిందే పూర్తికావాల్సి ఉందని చెప్పారు. అందుకే కార్పొరేట్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్ (సీడీఆర్) నిబంధనను తెచ్చామన్నారు.

 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
 పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలపైనా సీఎం స్పందించారు. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులతోపాటు, గతంలో పనులు మొదలై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. 2017 చివరి నాటికి వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి, నీరందిస్తామన్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు ఓ స్పష్టత వచ్చిన నేపథ్యంలో... త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని... నష్టపోయే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రద్దయినా నీటి విషయంలో రంగారెడ్డి జిల్లా వాసులు బెంగ పడాల్సిన అవసరం లేద ని సీఎం పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాకు నీరిస్తామని చెప్పారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల కారణంగా లిఫ్ట్‌ల ద్వారానే నీటిని తెచ్చుకోవాల్సి ఉందని.. అందుకోసం డబ్బు ఖర్చు పెట్టక తప్పదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు భారీ వ్యయాన్ని చూసి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

 కరెంటు భయం అవసరం లేదు
 భారీ ఎత్తున చేపట్టబోయే ఎత్తిపోతల పథకాలకు ఐదేళ్ల తరువాత దాదాపు రూ.9 వేల కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసినట్లు సీఎం కేసీఆర్ చె ప్పారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆ ఖర్చును భరించే పరిస్థితిలోనే ఉందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అదనంగా మరో నాలుగైదు వేల కోట్లు వ్యయం చేయడం ఇబ్బందేమీ కాదని తెలిపారు. అవసరమైతే గ్రాంట్లు తెచ్చుకుంటామని, కోటి ఎకరాలకు సాగునీరిస్తున్నందున ప్రజలు కూడా తోడ్పాటుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారన్నారు. డిచ్‌పల్లి-వార్దా, అంగుల్-పలాస లైన్లు అందుబాటులోకి రానున్నందున దేశంలో ఎక్కడినుంచైనా విద్యుత్ కొనే వెసులుబాటు కలుగుతుందన్నారు.

 అందుకే మొహం చాటేశారు
 తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల దుస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణమైనందున గురువారం నాటి ప్రజెంటే షన్‌కు ఆ పార్టీల సభ్యులు మొహం చాటేశారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు, పాత వాటి రీడిజైనింగ్ విషయంలో ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ బీజేపీపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ చేసిన సూచనకు సీఎం సానుకూలంగా స్పం దించారు. ‘‘శాసనసభకు మించి మనకు దేవాలయం ఏముంటుంది. అన్ని ప్రధాన పార్టీల సభ్యులు సభలో ఉన్నందున ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చామంటే ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకున్నట్లే కదా..’’ అని సీఎం చెప్పారు.  
  ఆసుపత్రి నుంచే అభినందించారు
 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విరామ సమయంలో ఎంతోమంది అభినందిస్తూ తనకు మెసేజ్‌లు పంపారని, అందులో ఆంధ్రా ప్రాం తం నుంచి వచ్చిన సందేశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నా.. ప్రజెంటేషన్‌ను టీవీల్లో చూసి అద్భుతంగా ఉందంటూ ఎస్సెమ్మెస్ పంపారన్నారు. రాజకీయాలు, పొరుగు రాష్ట్రాలతో పంచాయతీలు అవసరం లేదని, కావాల్సింది నీళ్లని అంతా గ్రహించారని చెప్పారు.
 
 ఏపీకి వెళ్లిన నాలుగైదు
 గ్రామాలు తిరిగి తెలంగాణలోకి..
 
 సాక్షి, హైదరాబాద్: పోలవ రం ముంపు నేపథ్యంలో ఏపీలో కలసిన కొన్ని గ్రామాలు తిరిగి తెలంగాణలో భాగం కాబోతున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఐదారు గ్రామాలను తిరిగి తెలంగాణకే ఇవ్వాలని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కోరగా... ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. భద్రాచలం పట్టణానికి చేరువలో ఉన్న ఆ గ్రామాలు ఏపీలో ఉండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో వాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరామని తెలిపారు. దీనిపై త్వరలోనే శుభవార్త వస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement