పెళ్లి ప్రకటనే పెట్టుబడి | Wedding advertising investment | Sakshi
Sakshi News home page

పెళ్లి ప్రకటనే పెట్టుబడి

Published Sun, Jan 4 2015 2:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

Wedding advertising investment

వరుడు కావాలని ప్రొఫైల్ క్రియేట్  చేసిన వివాహిత
ఎన్‌ఆర్‌ఐనని నమ్మించి రూ.35 లక్షలు కాజేత
సీీసీఎస్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన నిందితురాలు

 
 సిటీబ్యూరో:  ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసానికి పాల్పడింది.  సీసీఎస్ డీసీపీ పాలరాజు కథనం మేరకు..బేగంపేటకు చెందిన మాలవిక (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి కోసం వరుడు కావాలని మ్యాట్రిమోని డాట్ కామ్ వెబ్‌సైట్‌లో త న తప్పుడు ప్రొఫైల్‌ను పెట్టింది.
 
చిన్న పిల్లల వైద్యురాలినని..
 

ప్రొఫైల్‌లో ‘తాను అమెరికాలో పుట్టాను. ఇండియాలో అమ్మమ్మ చనిపోవడంతో తాతయ్య ఆరోగ్యం చూసుకునేందుకు వచ్చాను. తాను చిన్న పిల్లల నిపుణుల డాక్టర్‌ని, నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుడు కావలెను. నాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయని’  పేర్కొంది.

ట్రాప్‌లో పడ్డ ఎన్‌ఆర్‌ఐ

ఆమె ప్రొఫైల్‌ను చదివి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు జి.ప్రశాంత్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ప్రేమలో పడ్డ అతగాడు ప్రతిరోజు సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లో వీడియో చాట్ చేసేవాడు. తన అవసరాల నిమిత్తం కొంత డబ్బు కావాలని కోరడంతో ఆమె అకౌంట్‌లోకి విడతల వారీగా మొత్తం రూ.35 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక పెళ్లి చేసుకునేందుకు గత నవంబర్‌లో ప్రశాంత్ ఇండియాకు రావడంతో ఆమె గుట్టు రట్టు అయ్యింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. అయితే ఆమె మకాం మార్చడంతో పోలీసులకు దొరకలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనుగొన్నారు. విచారణ నిమిత్తం సీసీఎస్‌కు రావాలని పోలీసులు కోరారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె సీసీఎస్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆమె బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది. అందులో..తన పరువు పోయిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement