పెళ్లి ఖర్చులో అమ్మాయిల దూకుడు
సాక్షి, హైదరాబాద్ : పెళ్లంటే ఆకాశమంతా పందిరి.. భూదేవంత పీట వేసి కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతీయువకులు కలలు కంటారు. ఎవరి తాహతుకు తగ్గట్లు వారు ఖర్చు పెడతారు. పెళ్లి, ఖర్చుల విషయంలో యువతులు, యువకులు ప్రణాళికలపై పెళ్లి సంబంధాలు కుదిర్చే ప్రముఖ వెబ్సైట్ ‘మాట్రిమోనీ డాట్ కామ్’తాజాగా సర్వే నిర్వహించింది. పెళ్లి ఖర్చు విషయంలో యువకులతో పోల్చితే యువతులే ఓ మెట్టు ఎత్తులో ఉన్నట్లు ఇందులో తేలింది.
కాస్త ఎక్కువ ఖర్చు చేసేందుకే వారు మొగ్గుచూపుతున్నారు. ఈ సర్వేలో మొత్తం 9,246 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. వారిలో 20.6 శాతం యువతులు పెళ్లికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేయాలని భావిస్తుండగా.. అంత ఖర్చుకు 11.2 శాతం యువకులే సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు 6.1 శాతం యువతులు సై అనగా.. ఇందుకు 3.01 శాతం యువకులే ఓకే చెప్పారు. రూ.50 లక్షలకు మించి ఖర్చు చేయాలని 2.06 శాతం యువతులు, 1.59 శాతం యువకులు ప్రణాళికల్లో ఉన్నారు.
ఉత్తరాదిలో ఖర్చులు ఎక్కువ..
దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతీయుల పెళ్లి ఖర్చులు ఎక్కువే. పెళ్లికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఖర్చు చేసేందుకు 18.6 శాతం ఉత్తరాదివారు సై అంటుండగా.. దక్షిణాదివారు 12 శాతం ఉన్నారు. అంత మొత్తం వెచ్చించేందుకు పశ్చిమ భారతీయులు 11.1% , తూర్పు భారతీయులు 10.9% సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏటా దేశంలో కోటి నుంచి 1.2 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నాయని కేపీఎంజీ కన్సల్టెన్సీ 2014లో రూపొందించిన ఓ నివేదికలో పేర్కొంది.
పెళ్లి ఆభరణాలకు..
పెళ్లి ఆభరణాలపై రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చు చేయాలనే ప్రణాళికలతో ఉన్నామని 22.14 శాతం యువతులు, 19.52% యువకులు తెలిపారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాలని 13% యువతులు, 8.1 % యువకులు ఆలోచిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేస్తామని 13.89% యువతులు, 6% యువకులు పేర్కొన్నారు. ఆభరణాలపై రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసేందుకు 50.98% యువతులు, 66.24% యువకులు ఇష్టంగా ఉన్నారు.
వివాహ విందుకు..
వివాహ విందు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాలని 31.84 శాతం యువతులు, 27.62 శాతం యువకులు భావిస్తున్నారు. రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయాలని 7.87 శాతం యువతులు, 6.9 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. వివాహ విందు భోజనం విషయంలోనూ ఉత్తరాది వారే ముందున్నారు. విందుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేయాలని 35.32 శాతం ఉత్తర, 29.36 శాతం తూర్పు, 26.49 శాతం దక్షిణ, 25.78 శాతం పశ్చిమ భారతీయులు భావిస్తున్నారు.
♦ విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు 27 శాతం యువకులు, 19.3 శాతం మంది యువతులు ఇష్టం చూపారు.
♦ 40.31 శాతం యువకులు, 36.21 శాతం యువతులు వెడ్డింగ్ ప్లానర్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.
♦ ఫొటోగ్రఫీకి రూ.50 వేల నుంచి రూ.లక్ష ఖర్చు చేయాలని 27.08 శాతం యువతులు, 25.84 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. రూ.లక్షకు పైగా ఖర్చు చేసేందుకు 5.85 శాతం యువతులు, 5.70 శాతం యువకులు యోచిస్తున్నారు.
♦ వస్త్రాలపై రూ.లక్షకు పైగా ఖర్చు చేయాలని 20.22 శాతం యువతులు, 15.24 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తామని 40.67 శాతం యువతులు, 39.92 శాతం యువకులు తెలిపారు.
♦ పెళ్లి మండపం కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాలని 25.12 శాతం యువతులు, 22.02 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. రూ.2 లక్షలకు మించి ఖర్చు చేయాలని 6.74 శాతం యువతులు, 5.81 శాతం యువకులు భావిస్తున్నారు.
హనీమూన్ కోసం..
లింగ భేదంతో సంబంధం లేకుండా పెళ్లి తర్వాత గోవా, కేరళ, సిమ్లా, మనాలీలకు హనీమూన్ కోసం వెళ్లాలని యువతీయువకులు ఆశిస్తున్నారు. విదేశాల్లో హనీమూన్ కోసం స్విట్జర్లాండ్, మాల్దీవులు, సింగపూర్ వెళ్లాలని కోరుకుంటున్నారు.