న్యాయవ్యవస్థలోకి రండి | welcome to justice system : Supreme Court Chief Justice Justice tirath Singh Thakur | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థలోకి రండి

Published Sun, Aug 7 2016 2:15 AM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM

న్యాయవ్యవస్థలోకి రండి - Sakshi

న్యాయవ్యవస్థలోకి రండి

న్యాయ విద్యార్థులకు సుప్రీం సీజే జస్టిస్ ఠాకూర్ పిలుపు
* బహుళ జాతి సంస్థల్లో మగ్గొద్దు.. అక్కడ డబ్బున్నా సంతృప్తి ఉండదు
* ఒకప్పుడు సీటు దొరక్కపోతే లా.. ఇప్పుడు బాగా డిమాండున్న కోర్సు
* న్యాయవాదులు ఆర్జిస్తున్నంత డబ్బు ఎవరూ ఆర్జించడం లేదు
* సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాలని సూచన

సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, ప్రజలకు సత్వర న్యాయం అందేందుకు న్యాయవ్యవస్థలోకి రావాలని యువ న్యాయ విద్యార్థులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరథ్ సింగ్ ఠాకూర్ కోరారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత బహుళ జాతి సంస్థల్లో చేరితే ఆర్థికంగా లాభమున్నా, వృత్తిపరంగా ఆత్మ సంతృప్తి ఉండదన్నారు.  

హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న నల్సార్ వర్సిటీ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరామిరెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, నల్సార్ వీసీ ఫైజన్ ముస్తాఫా, రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కోర్సులను పూర్తి చేసిన వారికి జస్టిస్ ఠాకూర్ డిగ్రీలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకాలు అందచేశారు. తాన్యా చౌదరి అనే విద్యార్థిని ఏకంగా 17 బంగారు పతకాలు సాధించారు.

ప్రజలకు సేవ చేయండి
డిగ్రీల ప్రదానం అనంతరం జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. ‘‘ఒకప్పుడు లా కోర్సు అంత పాపులర్ కాదు. ఇతర కోర్సుల్లో సీట్లు దొరక్కపోతే లా కోర్సులో చేరేవారు. ఇప్పుడు దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో లా ఒకటి. దేశంలో ప్రస్తుతం విజయవంతమైన న్యాయవాదులు ఆర్జిస్తున్నంత డబ్బును ఇతర రంగాల్లో ఏ వ్యక్తీ ఆర్జించడం లేదు. న్యాయవ్యవస్థలోకి వచ్చి కొన్ని సవాళ్లను ఎదుర్కొని, కొంత కృషి చేస్తే మీరూ ఆ స్థాయికి చేరుకోగలరు. ఈ వృత్తిలో చూడాల్సింది ఎంత డబ్బు సంపాదించామని కాదు.. కేసులను వాదించడం ద్వారా, తీర్పులివ్వడం ద్వారా ఎంత ఆత్మ సంతృప్తి సాధించామన్నదే.

మీరు దేవుళ్ల ప్రతినిధులు. వారు చేయాల్సిన న్యాయాన్ని మీ చేత చేయించేందుకు మీ చేత న్యాయశాస్త్రం అభ్యసింపజేశారు. జడ్జీలు తమ బాధ్యతలను తపస్సులాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఘోర తపస్సు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మేం అదే చేస్తున్నాం. వీటన్నింటికీ వెనుకాడకుండా ముందుకెళితే ప్రజలు మనల్ని నెత్తినపెట్టుకుని ఆరాధిస్తారు..’’ అని పేర్కొన్నారు.
 
మనతో పాఠాలు చెప్పించుకోవాలి
దేశంలో న్యాయ పాలన సక్రమంగా సాగేందుకు యువ న్యాయ విద్యార్థులు న్యాయవ్యవస్థలోకి రావాలని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. మనకు ఇప్పుడు 19 న్యాయ యూనివర్సిటీలు ఉన్నాయని, అయినా ఎల్‌ఎల్‌బీ తరువాత ఉన్నత చదువుల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నామని చెప్పారు. బోధనా రంగంలో నాణ్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి బోధనా రంగంలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పితే మనం ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి యూనివర్సిటీలకు వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదని... వాళ్లే ఇక్కడికొచ్చి మన చేత పాఠాలు చెప్పించుకుంటారని చెప్పారు.
 
న్యాయమూర్తుల కొరత ఎక్కువగా ఉంది
సత్వర న్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ న్యాయమూర్తుల కొరత ఎంతో ఉందని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. అమెరికాలో పది లక్షల జనాభాకు 150 మంది జడ్జీలుంటే, మనదేశంలో 18 మంది మాత్రమే ఉన్నారన్నారు. దేశంలోని అన్ని కోర్టుల్లో 3 కోట్ల పెండింగ్ కేసులుంటే.. వాటిని పరిష్కరించేందుకు 18 వేల మంది జడ్జీలే ఉన్నారన్నారు. 5, 10, 20 ఏళ్ల నాటి కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని.. ఐదేళ్లకు పైబడి కొనసాగుతున్న కేసులను సున్నాకు తీసుకురావాలన్న లక్ష్యంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు.  

న్యాయవ్యవస్థలోకి వచ్చిన తరువాత ఎందుకొచ్చామా అనే భావన ఉండొద్దని విద్యార్థులకు సూచించారు. ‘‘నేను మొదట ఇంజనీరింగ్‌లో చేరాను. తర్వాత మా నాన్న సూచన మేరకు లా లో చేరాను. 22 ఏళ్ల పాటు న్యాయవాదిగా, 23 ఏళ్లుగా న్యాయమూర్తిగా ఉన్నాను. ఈ 45 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ వృత్తిలోకి ఎందుకొచ్చానా అని భావించలేదు. బోధన, వైద్య వృత్తులు గొప్పవే.. వాటన్నింటి కంటే న్యాయ వృత్తి ఇంకా గొప్పది..’’ అని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement