బాబు విదేశీ పర్యటనల మర్మమేంటి?
ఎమ్మెల్సీ కోలగట్ల సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ విదేశీ పర్యటనల మర్మమేంటి? అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికా? లేక తన పెట్టుబడులను అక్కడ పెట్టి రావడానికా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికేనని చంద్రబాబు పైకి చెబుతున్నారని కానీ ఆయన వెళ్తున్నది ఏపీలో దోచుకున్నది విదేశాల్లో దాచుకోవడానికేనని ప్రజలనుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన గత 9 ఏళ్ల పాలనలో కూడా భాగస్వామ్య సదస్సులు నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని, చివరికేమీ లేదని గుర్తు చేశారు.
ఆ తొమ్మిదేళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉంటేనే విదేశీ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, అలాంటిది జూట్, ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు మూతపడిన పరిస్థితులు ఉంటే వారెలా వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలేననీ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్నారు. రెండేళ్లలో అసలు చంద్రబాబు సాధించిన అభివృద్ధి ఏమైనా ఉందా? రైతుల రుణాల భారం తగ్గిందా? డ్వాక్రా మహిళల రుణాలు రద్దయ్యాయా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పరిమితులు లేకుండా అమలు చేస్తున్నారా? అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.