గ్రూప్ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు? | When was Group notifications? | Sakshi
Sakshi News home page

గ్రూప్ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?

Published Sat, Dec 19 2015 6:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

గ్రూప్ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు? - Sakshi

గ్రూప్ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?

సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్న లక్షలాది మంది అభ్యర్థులు.. గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షల కోసం రాత్రీపగలూ కుస్తీ పడుతూ, శిక్షణ తీసుకుంటున్నారు. వెంటనే గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దాదాపు 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో సుమారు 15 వేల పోస్టులకు అనుమతినిచ్చినా... వీటిల్లో గ్రూప్స్ పోస్టులు చాలా తక్కువ. దీంతో వీటి భర్తీపైనా టీఎస్‌పీఎస్సీ తర్జనభర్జన పడుతోంది. ప్రతి లక్ష మందికి 100 పోస్టులు కూడా లేని పరిస్థితుల్లో నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని భావిస్తోంది. మరిన్ని పోస్టులకు అనుమతి వస్తే... అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం ముందుగా ఉన్న పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నారు.

 మరిన్ని పోస్టులు ఎప్పుడు వచ్చేనో?
 రాష్ట్రంలో సుమారు 25 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో 15,522 పోస్టుల భర్తీకి సీఎం నాలుగు నెలల కిందే ఆమోద ముద్ర వేశారు. అందులో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు మూడు వేల పోస్టులకు ఆమోదం తెలపగా... వీటిలో రెండు వేల వరకు ఇంజనీర్ పోస్టులే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-1 పోస్టులు 52 ఉండగా, గ్రూప్-2 పోస్టులు 434 మాత్రమే ఉన్నాయి. గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులే లేవు. ఇక మరో 10 వేల పోస్టులకు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి రెండు నెలల కిందే పంపించింది. దానికి ఇంకా ఆమోదం రాలేదు. అయితే అందులో మరిన్ని గ్రూప్-1, 2 పోస్టులతో పాటు గ్రూప్-3, 4 పోస్టులు ఉంటాయని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కువ మంది ఎదురుచూసే గ్రూప్-2 కేటగిరీలో 2 వేలకు పైగా పోస్టులు వస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీపై టీఎస్‌పీఎస్సీ తర్జనభర్జన పడుతోంది.

 ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్
 రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు 6.5 లక్షలకుపైగా ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రారంభించిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేయించుకున్న వారే 6,22,302 మంది (పదిరోజుల కిందటి వరకు) ఉన్నారు. నోటిఫికేషన్లు జారీ అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. వీరిలో గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నవారే 5 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అనుమతి లభించిన కొన్ని పోస్టులతోనే నోటిఫికేషన్లు జారీ చేయాలా, ప్రభుత్వం నుంచి మరిన్ని పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ వచ్చాక అన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలా? అన్న గందరగోళంలో టీఎస్‌పీఎస్సీ ఉంది. ఇప్పుడున్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, మరిన్ని పోస్టులకు అనుమతి వస్తే వాటిని సప్లిమెంటరీ నోటిఫికేషన్‌గా ఇస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement