
నయీమ్ యాక్షన్ టీమ్ ఎక్కడ..?
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించని ఏడుగురి జాడ
► ఈ కరడుగట్టిన నేరగాళ్లతోనే ‘కీలక ఆపరేషన్లు’
► ముమ్మరంగా గాలిస్తున్న రాష్ట్ర పోలీసు వర్గాలు
► ఇప్పటి వరకు చిక్కిన వారంతా సివిల్ వ్యవహారాల్లో క్రిమినల్సే
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అతడి అనుచరుల్ని పోలీసులు పట్టుకుంటున్నారు. అయితే వీరందరినీ మించిన ‘యాక్షన్’ టీమ్ ఒకటి ఉందని రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఏడుగురి కోసం రాష్ట్ర పోలీసు విభాగం ముమ్మరంగా గాలిస్తోంది. నయీమ్‌తోపాటు అతడి సామ్రాజ్యాన్ని కూడా కుప్పకూల్చాలనే ఉద్దేశంతో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు నయీమ్‌తో సంబంధమున్న 20 మందిని పైగా అరెస్టు చేశారు. అయితే వీరంతా ఇప్పటి వరకు వెలుగులోకి రాని సివిల్ నేరగాళ్లని, తెరచాటుగా ఉంటూ నయీమ్ ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారని అధికారులు పేర్కొంటున్నారు.
భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు చేయడం, ల్యాండ్ సెటిల్‌మెంట్స్‌లో కీలకపాత్ర పోషించడంతోపాటు నయీమ్ ఆస్తులకు బినామీలుగా, ఆస్తి పత్రాలు, నగదు, ఆయుధాలు దాచే డెన్స్‌కు కేర్ టేకర్స్‌గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీమ్ కనుసన్నల్లో పని చేసింది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు తదితరులతో కూడిన ఈ టీమ్ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో యాక్టివ్‌గా పని చేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. నయీమ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని.
వీరికి బదులుగా ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్‌కు చెందిన వారి పేర్లు కేవలం కుట్రదారులుగానే ఉంటాయి. ఇంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిని కూడా అణచివేయకుంటే నయీమ్ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేయవచ్చని స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందాలు ఈ యాక్షన్ టీమ్ సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఈ ఏడుగురూ అత్యంత కీలకం..
నయీమ్ యాక్షన్ టీమ్‌లో ఏడుగురు వ్యక్తులు అత్యంత కీలకమని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన, హైదరాబాద్‌లో జరిగిన పటోళ్ల గోవవర్దన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న.. యాక్షన్ టీమ్‌లో అత్యంత కీలకం. ఇతడితో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన చెన్నారం రాజు, అచ్చంపేటకు చెందిన జహంగీర్, సిద్దిపేటకు చెందిన మల్కపురం మహేశ్ (పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్యకు స్కెచ్ ఇతడే వేసినట్లు ఆరోపణలున్నాయి), మహబూబ్‌నగర్‌కు చెందిన దామోదర్‌రెడ్డి (ఇతడి సోదరుడు వెంకట్‌రెడ్డిని పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్య చేశాడు) హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌కు చెందిన ఆసిఫ్, పాతబస్తీకి చెందిన ఫెరోజ్.. యాక్షన్ టీమ్‌లోని ప్రధాన సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడుగురితోపాటు వీరి నీడలో పని చేసిన, చేస్తున్న కిరాయి మనుషుల జాడ కూడా గుర్తించేందుకు రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.