వడ్డీలేని రుణ పథకం.. లేనట్టేనా?
- డ్వాక్రా సంఘాలకు అందని రుణాలు
- బ్యాంకులకు వడ్డీ చెల్లింపుల్లో సర్కారు వెనుకంజ
సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళలకు అమలుచేసే వడ్డీ లేని రుణ పథకం కొండెక్కింది. పైగా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు నిలిచిపోయాయి. పథకానికి సర్కారు సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో వడ్డీలేని రుణాల పథకం ప్రస్తుతం మూలనపడిందన్న చర్చ జరుగుతోంది. దీంతో డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం మూడేళ్ల నుంచి కుంటుపడింది. సెర్ప్ నుంచి రెండేళ్లుగా వడ్డీలేని రుణాల పథకం కింద ప్రతిపాదనలు వెళుతున్నా సర్కారు నుంచి స్పందన కనిపించడంలేదని సెర్ప్ అధికారులు చెబుతున్నారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.2 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాల్సి ఉండగా, అవి ఇప్పటివరకు మహిళలకు చేరలేదు. దీంతో బకాయిలుగానే ఉండిపోయాయి. ఫలితంగా స్వయం ఉపాధిపై ఆధారపడే మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు 15 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా సంఘాల్లోని సుమారు కోటి మంది మహిళలు ప్రభుత్వ సాయంకోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు లక్షలాది సంఘాల్లోని సభ్యులు వడ్డీ లేని రుణాల కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పటికే తీసుకున్నవారు వడ్డీ భారాన్ని మోస్తున్నారు.