‘ముత్తూట్’ బంగారం ఎక్కడ..?
• ఇన్నాళ్లూ దొంగల కోసం.. ఇçప్పుడు పసిడి కోసం వేట
• క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ‘ముత్తూట్’ దోపిడీ
• సూత్రధారి దొరికినా ‘బంగారం’ దొరకకపోవడంతో తంటాలు
• వాడీ, ముంబైలో గాలింపు.. రెండు, మూడు రోజుల్లో రికవరీకి యత్నాలు
సాక్షి, హైదరాబాద్: ‘ముత్తూట్ ఫైనాన్షియల్’లో భారీ దోపిడీ.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సర్దార్‌జీ పాత్రలో సీబీఐ అధికారిగా నటించి.. దోపిడీకి ముఠా నాయకుడిగా వ్యవహరించిన ముంబైలో స్థిరపడిన కర్ణాటకవాసి లక్ష్మణ్ నారాయణ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు దొరకడంతో కేసు ఛేదించామని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారి వద్ద బంగారం లేకపోవడంతో కథ అడ్డం తిరిగినట్లయ్యింది. దీంతో ఇన్నాళ్లు దొంగల కోసం వెతికిన పోలీసులు ఇప్పుడు బంగారం కోసం పరుగులు పెడుతున్నారు.
దొంగలతో కలసి పోలీసుల గాలింపు..
డిసెంబర్ 28న రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా 46 కిలోల బంగారాన్ని దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక వాడీలోని తమ స్థావరానికి చేరుకునే వరకు ఈ ముఠా చాకచాక్యంగా వ్యవహరించింది. జాతీయ రహదారి 65పై ఉన్న ముత్తూట్ ఫైనాన్షియల్‌లో దోపిడీని సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. 16 బృందాలను దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దింపారు. గ్రేహౌండ్స్ సిబ్బంది సహకారం కూడా తీసుకున్నారు. దాదాపు వారం తర్వాత దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో.. దాని డ్రైవర్, సర్దార్‌జీ వేషధారణలోని లక్ష్మణ్‌నారాయణ్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారం లభించకపోవడంతో కథ మొదటికొచ్చింది. దీంతో ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు బంగారం కోసం దొంగలతోనే కలసి ముంబై, వాడీ ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
ఆది నుంచి పక్కా వ్యూహాలే..
‘ముత్తూట్’దోపిడీ కోసం దొంగలు పక్కా వ్యూహాన్ని అమలు చేయగా.. వారిని పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు కూడా అదే మంత్రాన్ని పఠించారు. దోపిడీ జరిగినప్పటి నుంచి దొంగలు వాడీ స్థావరా నికి చేరుకున్నంత వరకు ఏ చిన్న విషయం కూడా బయటకు తెలియకుండా పోలీసు కమి షనర్ సందీప్ శాండిల్యా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల సేకరణకు.. దొంగలను వెతికేందుకు.. వాహనాల తనిఖీ లకు.. వాడీతో పాటు ముంబైలో గాలింపునకు ఇలా వివిధ బృందాలను పంపించి ఒకరి విషయం ఒకరికి తెలియకుండా దొంగలను పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇన్ని ప్రయత్నాలు చేసి పట్టుకున్న దొంగల వద్ద బంగారం లభ్యం కాకపోవడంతో దాని కోసం మళ్లీ కసరత్తు మొదలైంది. దోపిడీ సూత్రధారి లక్ష్మణ్‌నారాయణ్ అదుపులోనే ఉండటంతో బంగారం రికవరీ చేస్తామన్న ధీమాలో పోలీసులు ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో మిగతా ముగ్గురు నిందితులతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.