గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కూటమి పేరుతో జతకట్టిన తెలుగుదేశం- బీజేపీలు నామినేషన్ల ఉపసంహరణ రోజు ఆడిన నాటకం టీఆర్‌ఎస్‌కు కొన్ని సీట్లను పెంచబోతోందని ఆ రెండు పార్టీల నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 150 సీట్లకు గాను టీడీపీ 87, బీజేపీ 63 సీట్లలో పోటీ చేయాలని తొలుత ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే బీజేపీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు, టీడీపీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ రోజు ఏదోలా సర్దుకుంటుందిలే అనుకున్న అధికారిక అభ్యర్థుల గుండెల్లో చివరి నిమిషంలో బాంబులు పడ్డాయి. టీడీపీ తన సీట్లు 87కు అదనంగా 5చోట్ల అధికారికంగా, మరో రెండు చోట్ల అనధికారికంగా బీ-ఫారాలు ఇచ్చింది. అది తెలిసిన వెంటనే బీజేపీ అభ్యర్థులు తమ అగ్రనేతలను కలవడంతో వారు కూడా టీడీపీకి ఇచ్చిన ఐదు స్థానాలో తమ వాళ్లకు బీ-ఫారాలు ఇచ్చి ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’కు తెరలేపారు.
చర్లపల్లి, మల్లాపూర్, జూబ్లిహిల్స్ వంటి చోట్ల టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు రావడంతో బీజేపీ నాయకులు ఆందోళన చెందుతుంటే, అడిక్‌మెట్, అమీర్‌పేట, హబ్సిగూడ వంటి బీజేపీ గెలిచే అవకాశాలున్న చోట టీడీపీ అభ్యర్థులు బీ-ఫారాలు ఇచ్చి అభ్యర్థులను నిలబెట్టడంతో రెండు పార్టీల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు పార్టీల జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై చివరి నిమిషంలో అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఫ్రెండ్లీ ఫైట్’ పేరుతో పోటీలో ఉన్న సుమారు 12 స్థానాల్లోని మెజారిటీ స్థానాలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు కేక్‌వాక్‌గా తయారయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు... కేటీఆర్ వంద స్థానాలు గెలుచుకుంటామని చెప్పిన మాటలు నిజం చేసేందుకు టీడీపీ, బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.