
కరువు సహాయక చర్యల కోసం పోరుబాట
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుర్భిక్షం విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని శాసనమండలిలో ఆపార్టీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టకుండా నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకే తాము ఆందోళన బాట పడుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలు, ఎక్కడ వీలైతే అక్కడ పార్టీ శ్రేణులు ధర్నాలు చేపడతారన్నారు. ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ షెడ్యూలును ప్రకటిస్తామని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆందోళనలలో పాల్గొంటారన్నారు.
90 శాతం గ్రామాల్లో కరువు..: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ఏప్రిల్‌లోనే అత్యంత తీవ్రమైన కరువు ఏర్పడిందని, సాగు, తాగునీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం గ్రామాలు కరువు బారిన పడ్డాయన్నారు. 306 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఉపాధి హామీ నిధులను 4, 5 నెలలైనా విడుదల చేయని పరిస్థితులు దాపురించాయన్నారు.
నిధులు రాబట్టడంలో వైఫల్యం : కరువు పరిస్థితులను వివరించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. కరువు నష్టాన్ని రూ.2,443 కోట్లుగా అంచనా వేసి నివేదిక పంపితే కేంద్రం ఇచ్చిన సాయం రూ.433 కోట్లేనన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ సాయం ఎందుకు తెచ్చుకోలేక పోతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.