త్వరలో సాక్షి ఇండియా జియో బీ-2014
* జాగ్రఫీలో ప్రతిభ గల విద్యార్థుల కోసం నిర్వహణ
* అర్హులు.. 8, 9, 10వ తరగతుల విద్యార్థులు
* రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ.. ఈనెల 18
* డిసెంబర్ 4న ఫైనల్స్.. విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలు
సాక్షి, హైదరాబాద్: పిల్లలూ.. మీరు రోజూ స్కూల్లో చూసే గ్లోబ్‌లో అసలు పాములే ఉండని దేశం ఎక్కడుందో గుర్తుపట్టగలరా?.. బంధువులు మరణిస్తే చేతి వేళ్లు కట్ చేసుకునే జాతి ఏంటో చెప్పగలరా?.. ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే పేరుప్రఖ్యాతులతోపాటు బంగారు, వెండి, కాంస్య పతకాలను గెలుచుకునే అవకాశాన్ని సాక్షి మీడియా గ్రూప్ కల్పిస్తోంది. జాగ్రఫీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇండియా స్పెల్ బీ భాగస్వామ్యంతో ‘సాక్షి ఇండియా జియో బీ-2014’ పేరిట ప్రత్యేక పోటీ నిర్వహించనుంది.
హైదరాబాద్ నగరంలో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. పోటీలో భాగంగా ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, రీజినల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, కోస్టల్ జాగ్రఫీ, హిస్టారికల్ అండ్ టైమ్ జాగ్రఫీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సరళి, విజేతల ఎంపిక విధానాన్ని వివరించేందుకు ఈనెల 8, 9, 15, 16 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు సాక్షి టెలివిజన్‌లో డెమో క్లాస్‌లు ప్రసారం చేస్తారు. ‘ఆధునికత పెరిగే కొద్దీ పిల్లలకు ప్రకృతితో సంబంధం తగ్గిపోతోంది.
ప్రకృతిని, భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలపై ఉంది. అందుకే పిల్లలను ప్రకృతితో అనుసంధానించాలి. ప్రకృతి మనకు ఏమి ఇస్తుందో తెలిస్తేనే కదా దాన్ని రక్షించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. భూమ్మీది వింతలు, విశేషాలు, అందాలు.. అభివృద్ధి, ఆధునీకరణ నేపథ్యంలో అవెలా నాశనమవుతున్నాయన్న విషయం తెలిస్తే.. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే సాక్షి ఇండియా జియో బీ-2014 పోటీని నిర్వహిస్తున్నాం’ అని సాక్షి మీడియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో ఇలాంటి పోటీ నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. ఈ పోటీని రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. విజేతలకు బంగారు, వెండి, రజత పతకాలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. డిసెంబర్ 4న బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఫైన ల్స్ జరుగుతాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. చివరి తేదీ ఈ నెల 18. రిజిస్ట్రేషన్ రుసుము రూ.500. పాల్గొనదలచిన వారు వివరాల కోసం 9505551099, 9705123924 నంబర్లలో సంప్రదించవచ్చు.