హర్షితకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం | With government spending to Harshita healing | Sakshi
Sakshi News home page

హర్షితకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం

Published Sat, Jul 16 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

హర్షితకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం

హర్షితకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం

సాక్షి, హైదరాబాద్ : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్సకు డబ్బుల్లేక మెర్సీకిల్లింగ్‌కు అనుమతించాలని కోరుతూ హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు హర్షిత(11) కుటుంబీకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. హర్షితకు శస్త్రచికిత్స చేపట్టేందుకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి ముందుకు వచ్చిందని, ఇందు కోసం ఆరోగ్యశ్రీ నుంచి రూ.10.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ‘విరించి’ ఆస్పత్రి రూపొందించిన ‘వి కనెక్ట్ విరించి మొబైల్ యాప్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుండె, కాలేయ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు ఇప్పటి వరకు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఖరీదైన ఈ వైద్య సేవలను  పేదలకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు సామాజిక సేవలో భాగంగా నెలకు ఒక అవయవ మార్పిడి శస్త్రచికిత్సనైనా బాధితులకు ఉచితంగా చేసి, తమ దాతృత్వాన్ని చాటుకోవాలని కోరారు. నిరుపేదలకు అండగా ఉండే కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం కూడా తమ వంతు సాయం చేస్తుందన్నారు.

ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో అధునాతన హంగులతో 600 పడకల సామర్థ్యంతో ‘విరించి’ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కాగా మంత్రి విజ్ఞప్తికి ‘విరించి’ ఆస్పత్రి చైర్మన్ విష్ కొంపెల్ల స్పందించారు. తమ ఆస్పత్రిలో ప్రతి నెలా ఒకరికి ఉచితంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నట్లు ప్రకటించారు. తమ ఆస్పత్రిలో మరో నెల రోజుల్లో ఈ శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ మాధవీలత కొంపెల్ల, సీఎంఓ శ్రీనివాస్ మైనా, మెడికల్ డెరైక్టర్ ఎన్‌ఎస్‌వీవీమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి లక్ష్మారెడ్డి బంజారాహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement