ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తాం | with in five years we complete the debt waiver of farmers,says chandra babu naidu | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తాం

Published Fri, Oct 3 2014 12:29 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తాం - Sakshi

ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తాం

రైతులు, డ్వాక్రా రుణాలపై చంద్రబాబు వెల్లడి  
ఏడాదికి 20 శాతం చొప్పున బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తాం

 
* అదే తరహాలో డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు చొప్పున మాఫీ
* రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. లాభసాటి సాగు చేయాలి
* విజయవాడలో పలు పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
* కేంద్రం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం: నిర్మలాసీతారామన్

 
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలకు ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో అందరినీ రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా రైతు సాధికార సంస్థకు 20 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు. రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయడానికి రిజర్వు బ్యాంకు అంగీకరించలేదని.. కేంద్ర ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వస్తుందనే భావనతో ఏమీ చేయలేకపోతోందని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు సెల్‌ఫోన్లు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలుపుకుంటున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మభూమి - మా ఊరు, ఎన్‌టీఆర్  భరోసా, స్వచ్ఛాంద్రప్రదేశ్, ఎన్‌టీఆర్ సుజల, రూ. 10కే ఎల్‌ఈడీ బల్పుల పంపిణీ కార్యక్రమాలను చంద్రబాబు గురువారం విజయవాడలో ప్రారంభించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలసి నగరంలోని సింగ్‌నగర్‌లో రోడ్లు, మురుగునీటి కాల్వను శుభ్రం చేసిన ఆయన.. సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్క నాటారు. డాబా కొట్టు సెంటర్‌లో ఎన్‌టీఆర్ సుజల పథకం ప్రారంభించారు. అనంతరం ఎంబీపీ స్టేడియంలో జన్మభూమి - మా ఊరు, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

ఒక్కో మహిళకు రూ. 10 వేలు మాఫీ చేస్తాం
రాష్ట్రంలో 7 లక్షల డ్వాక్రా సంఘాలు ఉండగా అందులో 76 లక్షల మంది సభ్యులు ఉన్నారని.. ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేల వంతున రూ. 7,600 కోట్లు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసం డ్వాక్రా సాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని పదేళ్లలో రూ. లక్ష కోట్లకు పెంచుకుని పేదరికం మీద గెలుపు సాధించాలని మహిళలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లన్నీ డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ఇసుక తవ్వకాలకు అయ్యే ఖర్చును అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చే లాభాల్లో 25 శాతం డ్వాక్రా సంఘాలకు, 75 శాతం నిధులు రైతు ప్రాధికార సంస్థకు జమ చేస్తామని ప్రకటించారు.
 
డబ్బులుండి పింఛన్లు ఇవ్వడంలేదు...
ప్రభుత్వం దగ్గర డబ్బులుండి వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెంచిన పింఛన్లు ఇవ్వడం లేదని.. పేదలను ఆదుకుని అండగా నిలవాలనే ఉద్దేశంతో పింఛన్ల ద్వారా వారికి భరోసా కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. పేదల్లో నిరుపేదలందరికీ పింఛన్లు ఇస్తామనీ, అనర్హులెవరికీ స్థానం ఉండదన్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల జాబితాలు ఆన్‌లైన్‌లో ఉంచుతామని, అర్హులైన వారెవరైనా జాబితాలో లేకపోతే వారి పేర్లు చేర్చుతామని తెలిపారు. అనర్హులెవరైనా జాబితాలో ఉంటే ప్రజలు అధికారులకు ఈ విషయం తెలియచేయాలన్నారు.
 
మరుగుదొడ్డి వాడని వారు మనుషులు కాదు..
జన్మభూమి కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగాలని.. తాను కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్ల మీద చెత్త, మిగిలిపోయిన ఆహార పదార్ధాలు వేయడం, మురుగునీటిని రోడ్ల మీదకు వదిలేయడం, కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం లాంటి చర్యల వల్లే అపరిశుభ్రత పెరిగి,సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు వాడని వారు మనుషులే కాదంటూ.. ఈ విషయంలో ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారితో పాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు.
 
రాష్ట్రానికి సంపూర్ణ సహకారం: నిర్మలాసీతారామన్
కేంద్రం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ నేతృత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని.. రాష్ట్రం నుంచి అందే ప్రతి ప్రతిపాదనను నెరవేర్చడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, మంత్రులు దేవినే ని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, సుజనాచౌదరిలతో పా టు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
ఇదీ రైతు రుణ విముక్తి పథకం...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయడానికి ప్రయత్నించామని, ఇందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ప్రతి పైసా కూడబెట్టి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతో రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశామన్నారు. రైతు రుణాలు రీషెడ్యూల్ చేసి 20 శాతం కంటే ఎక్కువగానే రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరతామన్నారు. ఏడాదికి 20 శాతం చొప్పున 10 శాతం వడ్డీతో బ్యాంకులకు రైతు బకాయిలు చెల్లించి ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తామన్నారు. ఇది రుణ మాఫీ కాదని రైతు రుణ విముక్తి పథకమని సీఎం చెప్పారు. రైతులె వరూ అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దనీ, ఈ ఐదేళ్లు బ్యాంకులు బలవంతపు వసూళ్లు చేయకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి లాభసాటిగా వ్యవసాయం చేయాలని సూచించారు. విజయవాడ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని, నూతన రాజధాని నిర్మాణం విషయంలో అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి లాభసాటిగా ఉండేలా వ్యవహరిస్తామని సీఎం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement