
జలహారం
రూ.3 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్
చైనా ప్రతినిధుల ముందుకుప్రతిపాదనలు
యాదాద్రికి కేశవాపూర్ నీరు
1440 కి.మీ. పరిధిలో నీటి సరఫరా నెట్‌వర్క్
రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం
సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ జలహారానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సుమారు రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ సమగ్ర నీటి సరఫరా వ్యవస్థకు చైనా ఆర్థిక సాయం అందించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టనున్న అభివృద్ధి పథకాలకు ఆర్థిక సాయానికి చైనా బృందం సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ప్రతిపాదనలకు మోక్షం కలిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదే అంశంపై సోమవారం చైనా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా గ్రేటర్‌లో 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ జలహారం ఏర్పాటు చేయనున్నారు.
దీంతో ఓఆర్‌ఆర్ లోపల సుమారు 1440 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలు, గ్రామ పంచాయతీల్లో మంచినీటి సరఫరాకు అవసరమైన ప్రధాన, పంపిణీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనివల్ల ఔటర్ చుట్టూ కొరత ఉన్న ప్రాంతాలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మంచినీటిని తరలించే అవకాశం ఉంటుంది. నల్లగొండ జిల్లా దేవులమ్మ నాగారం, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని కేశవాపూర్‌లో భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు. కృష్ణ, గోదావరి, మంజీర, సింగూరు, జంట జలాశయాల నీటిని మహా నగరం నలుమూలలకు సరఫరా చేయనున్నారు. ఆదిబట్ల, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో విస్తరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధికి మంచినీటిని సరఫరా చేయనున్నారు. కేశవాపూర్ రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానానికి తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రూ.1500 కోట్లతో దేవులమ్మ నాగారం రిజర్వాయర్ ...
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం, మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనాతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం-మిడ్ మానేరు-కొమురెల్లి మల్లన్న సాగర్ (మెదక్) మీదుగా కేశవాపూర్‌కు నీటిని తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండు వేల ఎకరాలు ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీట్‌తో భూ మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంతమార్గంలో పంపింగ్.... మరి కొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి దీనిని నింపనున్నారు. వర్షాకాలంలో నీటి లభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు.
రూ.1200 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్
రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. దీనికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూములు అందుబాటులో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీన్ని భూ మట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. గోదావరి మంచినీటి పథకం మొద టి, రెండు, మూడో దశల్లో తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గోదావరిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జలాశయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దేవస్థానానికి మంచినీటిని అందించవచ్చని తెలిపారు.