తొలిరోజు ఉల్లంఘనులకు 3.64 లక్షల జరిమానా
హైదరాబాద్: హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. తాజాగా హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించడం నేటి నుంచే తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తొలి రోజే భారీగా ద్విచక్ర వాహనదారులు రూల్స్ ను ఉల్లంఘించి దొరికిపోయారు. రూల్స్ పాటించని వాహనాదారుల నుంచి తొలిరోజైన మంగళవారం 3,64,200 రూపాయల మొత్తాన్ని జరిమానా రూపంలో కలెక్ట్ చేసినట్లు నగర పోలీసుల నుంచి సమాచారం అందింది.
నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న 2,278 మందిపై కేసులు బుక్ అయ్యాయి. 2,28,200 రూపాయల జరిమానా విధించి వాహనదారుల నుంచి వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న వారు కూడా భారీగా దొరికిపోయారు. 272 మందిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారి వద్ద నుంచి 1,36,000 రూపాయలు వసూలు చేశారు.